విషాదం: ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే!

Venezula Mom Drink Urine And Saves Children Life With BreastFeed - Sakshi

Venezuela Mother Sacrifice Story: మనిషికి మాత్రమే కాదు.. మిగతా జీవరాశికి తల్లి స్పర్శే మొదటి ప్రేమ. అమ్మ ప్రేమ జీవికి ఆప్యాయతను పరిచయం చేస్తుంది. ‘అమ్మ’.. మాటల్లో వర్ణించలేని ఓ మధురానుభూతి.  అందుకేనేమో తల్లికి మాత్రమే సాధ్యపడే త్యాగానికి ఆమె సిద్ధపడింది. ప్రాణం పోతోందని తెలిసి కూడా సాహసానికి పూనుకుంది.  తాను నరకం అనుభవిస్తూ..  బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఆ తల్లి గాథ సోషల్‌ మీడియాలో ఇప్పుడు అందరితో కంటతడి పెట్టిస్తోంది.      

వెనిజులా బోట్‌ ప్రమాదం.. సెప్టెంబర్‌ 3న కరేబియన్‌ దీవులవైపు వెళ్లిన వెనిజులా టూరిస్ట్‌ క్రూజ్‌ బోట్‌ ఒకటి అదృశ్యం అయ్యిందని నావికా అధికారులకు సమాచారం అందింది.  దీంతో సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత  ‘లా టార్టు’ దీవి సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్‌ బోట్‌ను గుర్తించి.. దగ్గరి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగిన ఇద్దరు చిన్నారుల్ని గుర్తించి వెంటనే కాపాడారు. ఆ తల్లి పేరు  మార్లేస్‌ బీట్రిజ్‌ చాకోన్‌ మర్రోక్విన్‌. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదా ట్రిప్‌ కోసం వెళ్తే.. అది కాస్త వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపింది.
 

నరకం ఓర్చుకుంది.. 
భారీ అలల కారణంగా క్రూజ్‌ దెబ్బతినగా.. చిన్న లైఫ్‌ బోట్‌ సాయంతో మార్లేస్‌, తన బిడ్డల్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. వెనిజులా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అక్వాటిక్‌ స్పేసెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగాక నాలుగు రోజులపాటు ఆ తల్లీబిడ్డలు ఆ చిన్న లైఫ్‌బోట్‌లోనే ఉన్నారు. తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్‌, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్‌ వీలైనంత ప్రయత్నం చేసింది.

వాళ్ల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకుంది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని..  బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్‌ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె.   

మొత్తం తొమ్మిది మంది
లైఫ్‌ బోటులో తల్లి మృతదేహంలో ఒదిగి పడుకున్న పిల్లలను.. కారాకస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఒంటిపై సూర్య తాపానికి బొబ్బలు వచ్చాయి. తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు కూడా. మరోవైపు ఈ ఇద్దరు పిల్లల్ని చూసేందుకు నియమించిన యువతి వెరోనికా మార్టినెజ్‌(25).. పక్కనే ఓ ఐస్‌ బాక్స్‌లో పడుకుని బతికి బట్టకట్టింది. ప్రస్తుతం కోలుకున్న ఆ యువతి.. మానసికంగా మాత్రం కోలుకోలేకపోతోంది. 
 

అయితే ఆ మార్లేస్‌ భర్త రెమిక్‌ డేవిడ్‌ కాంబ్లర్‌ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.  సరదా ట్రిప్‌లో భాగంగా వెనిజులా హిగుయిరోట్‌ నుంచి లా టార్టుగా ఐల్యాండ్‌(కరేబియన్‌ దీవులు) వైపు తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమారు 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మిగిలిన వాళ్లెవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌ 11న ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top