మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ప్రకటించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
అరాఘ్చీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్దని పేర్కొన్నారు.
The Islamabad Memorandum of Understanding has never been closer. Pending its finalization, the media should refrain from entering speculation about its content.
In line with our responsible and transparent approach, all details will be shared with the public in due course.— Seyed Abbas Araghchi (@araghchi) June 12, 2026
ఇటీవల కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రచురించాయి. దీనిపై స్పందించిన అరాఘ్చీ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఒప్పందం ఖరారైన తర్వాత అన్ని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అరాఘ్చీ చేసిన పోస్టును తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ.. మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైన వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు.


