హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త షరతులు
అమెరికాకు తెలియజేసిన మధ్యవర్తి పాక్
కైరో/మాస్కో/దుబాయ్: హార్మూజ్ జలసంధిని దిగ్బంధం నుంచి విముక్తి కల్పించి యుద్ధానికి చరమగీతం పాడితే హార్మూజ్ జలసంధి గుండా విదేశీ వాణిజ్యనౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం ఒమన్ నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు తమ ప్రతిపాదనలకు హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియజేశారు. వీటిని అమెరికాకు పాక్ అందజేయనుంది. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పుతిన్‌తో అరాఘ్చీ భేటీ..
ఇరాన్ మంత్రి అరాఘ్చీ సోమవారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. తమ సార్వ¿ౌమత్వం కోసం పోరాడుతున్న ఇరానియన్లను ఈ సందర్భంగా పుతిన్ పొగిడారు. తర్వాత పశ్చిమాసియా యుద్ధం, హార్మూజ్ దిగ్బంధం, అమెరికా షరతులు, ఇరాన్ డిమాండ్లు తదితర కీలకాంశాలపై అరాఘ్చీ, పుతిన్ విస్తృతంగా చర్చించుకున్నారని రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్ తెలిపింది. ‘‘పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం రష్యా తన శక్తిమేరకు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో వ్యూహాత్మక బంధం బలోపేతానికి కృషిచేస్తాం’’అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టంచేశారు.
భారతీయ ట్యాంకర్‌పై కాల్పులు..
ఒమన్ నుంచి భారత్‌కు వస్తున్న రసాయనాల ట్యాంకర్ ఎంటీ చిరాన్7పై ఇరాన్ గన్‌బోట్లు హెచ్చరిస్తూ కాల్పులు జరిపాయి. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ కాల్పులఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్మూజ్‌కు వాయవ్యంగా ఒమన్‌కు చెందిన షినాస్ పోర్ట్ సమీప జలాల గుండా నౌక వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నౌకలోని 17 మంది భారతీయనావికులకు ఎలాంటి గాయాలుకాలేదని కేంద్ర షిప్పింగ్, పోర్ట్‌లు, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్‌దీప్ సింగ్ రంధావా తెలిపారు.


