అప్ఘనిస్తాన్‌లో దారుణం.. మానవహక్కుల కార్యకర్తల ఆందోళన

Afghan Women Working As Cop Blinded for Getting Job - Sakshi

కాబూల్‌: అఫ్ఘాన్‌ మహిళ ఖతేరాకు చిన్ననాటి నుంచి బాగా చదువుకుని.. పోలిసు ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలని కల. కానీ తండ్రికి మాత్రం ఆడవారు బయటకు వెళ్లి పని చేయడం అంటే నచ్చేది కాదు. అసలు ఆడపిల్లకు చదువే దండగ అనుకునేవాడు. కానీ ఖతేరా బలవంతం మీద చదువుకోవడానికి అంగీకరించాడు. ఇక ఉద్యోగం విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. అయితే ఖతేరా అదృష్టం కొద్ది అర్థం చేసుకునే భర్త లభించాడు. అతడు ఆమె ఆశయాన్ని తెలుసుకుని ఆ వైపుగా ప్రొత్సాహించాడు. దాంతో ఖతేరా తన కలను నేరవేర్చుకున్నారు. కొద్ది నెలల క్రితం అప్ఘనిస్తాన్‌లోని ఘజ్ని ప్రావిన్స్‌లోని పోలీసు స్టేషన్‌లో క్రైమ్‌ బ్రాంచ్‌లో అధికారిగా చేరారు. ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తుండేవారు. 

ఉద్యోగం మానేయాల్సిందిగా బెదిరించేవాడు
ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఖతేరా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమె మీద దాడి చేశారు. కత్తితో గాయపర్చడమే కాక కాల్పులు జరిపి ఆమె కళ్లు పోయేలా చేశారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖతేరాని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది కానీ జరిగిన దాడిలో ఆమె చూపు కోల్పోయింది. ఫలితంగా ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాలిబన్లు తన మీద దాడి చేశారని ఖతేరా, స్థానికులు చెప్తుండగా.. వారు మాత్రం ఆరోపణల్ని కొట్టి పారేశారు. తాలిబన్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఖతేరా ఉద్యోగం చేయడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. అతడే ఈ దాడి చేయించి ఉంటాడు. ఇది వారి కుటుంబ సమస్య. ఇందులో మా ప్రమేయం లేదు’ అని తెలిపాడు.

ఇక ఖతేరా మాట్లాడుతూ.. ‘నేను ఉద్యోగం చేయడం నా తండ్రికి ఇష్టం లేదు. కానీ భర్త ప్రొత్సాహంతో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరాను. నా తండ్రి ప్రతి రోజు నన్ను వెండించేవాడు. ఉద్యోగం మానేయాల్సిందిగా బెదిరించమంటూ తాలిబన్లను కోరాడు. నా ఐడీ కార్డు వారికి ఇచ్చి నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నానని వారికి తెలిపాడు. దాడి జరిగిన రోజు కూడా మా నాన్న నాకు ఫోన్‌ చేసి నేను ఎక్కడ ఉన్నది కనుకున్నాడు’ అన్నారు ఖతేరా. (చదవండి: నోబెల్‌ ‘శాంతి’ పోటీలో అప్ఘనిస్తాన్ మహిళ)

ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని తెలుసు
ఖతేరా మాట్లాడుతూ.. ‘ఏదో ఓ రోజు నాపై దాడి జరుగుతుందని తెలుసు. కనీసం ఒక్క ఏడాది అయినా ఉద్యోగం చేయాలని భావించాను. సంవత్సరం తర్వాత ఈ దాడి జరిగి ఉంటే ఇంత బాధపడేదాన్ని కాదు. డాక్టర్లు నాకు పాక్షికంగా చూపు వస్తుందని చెప్తున్నారు. అదే నిజమైతే.. చూపు వస్తే.. వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరతాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఖతేరా తన ఐదుగురు పిల్లలతో కలిసి కాబూల్‌లో రహస్యంగా జీవనం సాగిస్తున్నారు. ఇక తన పుట్టింటితో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్నారు. ఆమె తల్లితో సహా. ఎందుకంటే ఖతేరా ఫిర్యాదు మేరకు ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ కోపంతో ఖతేరా తల్లి ఆమెతో మాట్లాడటం లేదు. (చదవండి: తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక)

ఇక అఫ్ఘనిస్తాన్‌లో మహిళలు ఉద్యోగాలు చేయడం.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం తాలిబన్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పెద్దగా ఇష్టం ఉండదని మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. ఖతేరా పోలీసు అధికారిగా పని చేయడం తాలిబన్లకు కోపం తెప్పించింది అన్నారు. ‘పబ్లిక్‌ రోల్స్‌‌లో అఫ్ఘన్‌ మహిళల పరిస్థితి ఎప్పుడూ ప్రమాదకరమైనదే. ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా హింస పెరగడంతో వారి పరిస్థితి మరింత దిగజారిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ క్యాంపెయినర్‌ తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top