UK Court: జూలియన్‌ అసాంజే అప్పగింత తప్పదా?

UK Court Formally Issues Julian Assange US Extradition Order - Sakshi

సుదీర్ఘ చట్టపర తగాదా తర్వాత, లండన్‌ వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 2022 ఏప్రిల్‌ 20న, వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేని అమెరికాకు అప్పగించాలని ఉత్తర్వు జారీచేసింది. బ్రిటన్‌ హోమ్‌ సెక్రెటరీ ప్రీతి పటేల్‌ అతన్ని అమెరికాకు అప్పజెప్పడానికి ‘స్టాంప్‌’ వేసే స్థితికి వచ్చారు. అమెరికాలో అసాంజేపై గూఢచర్య చట్టం కింద విచారణ జరుగుతుంది. గూఢచారికీ, సమాజ సంరక్షకునికీ మధ్య తేడాను ఈ చట్టంలో వివరించలేదు. చరిత్రలో మొదటిసారి ఈ చట్టాన్ని ఒక పాత్రికేయునికి వర్తింపజేశారు. అసాంజే పాత్రికేయుడు కాదని అమెరికా ప్రభుత్వ వకీలు వాదించారు.

ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా పూర్వ కంప్యూటర్‌ ఇంటెలిజెన్స్‌ కన్సల్టెంట్‌. అమెరికా ప్రభుత్వం సొంత ప్రజల ఫోన్‌ కాల్స్, అంతర్జాల చర్యలు, వెబ్‌ కెమెరాలపై నిఘాను నిరూపించే రహస్య పత్రాలను బయట పెట్టారు. ఆయన మీద కూడా గూఢచర్య చట్టం కింద కేసు పెట్టారు. ‘‘అమెరికా న్యాయ శాఖ పాత్రికేయతపై యుద్ధం చేస్తోంది. ఈ కేసు అసాంజేపై కాదు, మీడియా భవిష్యత్తును నిర్ణయించేది’’ అని వ్యాఖ్యానిస్తూ పాత్రికేయునిపై ఈ చట్ట వర్తింపును స్నోడెన్‌ ఖండించారు. అసాంజేను వాక్‌ స్వాతంత్య్ర విజేతగా ఒకప్పుడు ప్రధాన స్రవంతి మీడియా ప్రశంసించింది. 2010లో ఆయన అమెరికా కుట్రల రహస్య సమాచారం బయట పెట్టగానే అదే మీడియా అసాంజేను వదిలేసింది. అసాంజే ఈ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్‌ చేయగలిగినా, కోర్టులో నెగ్గే అవకాశం చాలా తక్కువ.

అసాంజే ఆస్ట్రేలియా దేశానికి చెందిన సంపాదకుడు, ప్రచురణకర్త, సామాజిక కార్యకర్త. ఆస్ట్రేలియా అప్రజాస్వామిక ఆగడాలను భరించలేక పారదర్శక సమాజం ఉన్న స్వీడెన్‌లో స్థిరపడ్డారు. 2006లో వికీలీక్స్‌ స్థాపించాడు. 2010లో వికీలీక్స్‌ అమెరికా కుతంత్రాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసింది. వర్గీకరించిన వరుస దస్త్రాలనూ, దౌత్య సంబంధ తంత్రీ సమాచారాన్నీ పెద్ద మొత్తంలో ప్రచురించిన తర్వాత అమెరికా అసాంజేపై 18 నేరాలు మోపింది. ఇవి రుజువయితే వందేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా ఇద్దరు స్వీడెన్‌ సెక్స్‌వర్కర్లతో అసాంజేపై అసమంజస అత్యాచార కేసులు పెట్టించింది. ఆ కేసుతో సహా గూఢచర్య విచారణను ఎత్తేయాలని స్వీడెన్‌ 2012లో నిర్ణయించి, 2017లో ఎత్తేసింది.

స్వీడెన్‌ పార్లమెంటులో మితవాదం బలపడిన తర్వాత అసాంజేపై ఎత్తేసిన కేసులను 2019 మేలో తిరగదోడింది. కానీ నవంబర్‌లో విచారణను ఆపేసింది. అసాంజే 12 ఏళ్ల నుండి నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు ఆరేళ్ళ క్రితం లండన్‌లోని ఈక్వడోరియన్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయ మిచ్చారు. అప్పటి నుండి జైలు జీవితం అనుభవిస్తు న్నారు. బయటికి పోతే లండన్‌ పోలీసులు అరెస్టు చేసి అమెరికాకు అప్పజెపుతారని భయం. ఈక్వడార్‌ అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో అసాంజేను అప్పజెప్పి అమెరికాను సంతోషపెట్టాలని నిర్ణయించినప్పటి నుండి ఆయన కష్టాలు పెరిగాయి. 12 ఏళ్ళు దాటినా అమెరికా అసాంజేను కంటిలో ముల్లుగా, పక్కలో బల్లెంలా చూస్తోంది. తమ రహస్య సమాచారాన్ని బయటపెట్టి తమ దేశం పరువు పోగొట్టాడని భావిస్తోంది. (క్లిక్: అసమ్మతి గళాలపై అసహనం)

అసాంజే వికీలీక్స్‌ ఘటన తర్వాత అమెరికాను ముగ్గురు అధ్యక్షులు పాలించారు. దేశంలో వాక్‌ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ‘రక్షణల’ నిజ స్వరూపం తెలిసింది. అమెరికా అంతర్జాతీయ సమాజ నియమాలు, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న వైనాన్ని బయటపెట్టే ఎవరినైనా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి తన సన్నిహిత దేశాల సహాయంతో జైలులో పెట్టవచ్చని అమెరికా భావిస్తోంది. తన స్వేచ్ఛా ముఖాన్ని ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించడానికే వాడుకుంటోంది. (క్లిక్: రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!)

- సంగిరెడ్డి హనుమంత రెడ్డి
వ్యాసకర్త ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top