తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!

Kommineni Srinivasa Rao Article On Chandrababu Naidu English Medium Education - Sakshi

విశ్లేషణ

తెలుగు భాష గొప్పతనం పట్ల ఎవరికీ సందేహాలు లేవు. అదే సమయంలో జీవితంలో ఎదగడానికి ఇంగ్లిషు అవసరాన్ని కూడా ఎవరూ నిరాకరించలేరు. ఆంగ్ల మాధ్యమంలో పిల్లలను చదివించడానికి వైసీపీ ప్రభుత్వం చేసే ప్రయత్నం, తెలుగు భాష గొప్పతనాన్ని తక్కువ చేయడం కాదు. అది కాలానుగుణమైన విధానం. నిరుపేదలకు ఆంగ్ల సరస్వతిని దగ్గర చేయడం. అయినా తెలుగు నెపంతో ప్రతిపక్షాలు విమర్శించడం దురుద్దేశాలతో కూడుకున్నది. పోనీ తెలుగు మీద ఇంత అభిమానం కనిపిస్తున్నట్టుగా నటిస్తున్న ఈ నేతలు తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారా, చదివిస్తున్నారా, చదివిస్తారా? ఆచరణలో పెట్టని నీతులకు విలువ ఉండదు. అది ప్రజలకు స్పష్టంగా తెలుసు.

తెలుగు భాష గొప్పదే. దానిని అంతా కాపా డుకోవలసిందే. అదే సమయంలో తెలుగు యువత జీవితాలు అంతకన్నా గొప్పవి. వారు ఉన్నతంగా ఎదగడా నికి తెలుగుతో పాటు ఇతర భాషలు కూడా అధ్యయనం చేయవలసిన రోజులివి. తెలుగును వాడుక భాషలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయనకు నివాళి అర్పించే సందర్భంగా తెలుగు విశిష్టత గురించి మాట్లాడుకోవడం ఆహ్వానించదగిందే. కానీ ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయాలన్న తలంపు కొందరికి రావడమే దురదృష్ట కరం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రకటన చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు కోసం ఈయన చేసినంత కృషి ఇంకెవరూ చేయలేదేమోనన్న భావన కలుగుతుంది. బోధన భాషగా, పాలన భాషగా ఉన్నప్పుడే ఆ భాష రాణిస్తుందని చంద్ర బాబు సెలవిచ్చారు. తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు దాదాపు పద్నాలు గేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తెలుగును బోధన భాషగా, పాలనభాషగా ఎంత వృద్ధి చేశారు? ఇంగ్లిష్‌ మీడియం గురించి చర్చ జరుగుతున్నప్పుడు మున్సిపల్‌ స్కూళ్లలో తొలుత తానే ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టానని ఎందుకు చెప్పారు? పోనీ తన పాలనా కాలంలో ఒక శాఖలో అయినా తెలుగులో ఫైళ్లను నడిపారా?

తెలుగును నీరుకార్చమని ఎవరూ చెప్పరు. కానీ ప్రపంచంతో పాటు మనం నడవకపోతే ఎంత వెనుకబడిపోతామో తెలుగు మీడి యంలో చదివి నానాపాట్లు పడుతున్నవారిని అడిగితే తెలుస్తుంది. తెలుగులో చదువుకున్న కొద్దిమంది ఉన్నత స్థానాలలోకి వెళ్లి ఉండ వచ్చు. అంతమాత్రాన అంతా తెలుగులోనే చదవాలని చెప్పడం కరెక్టు కాదు. తెలుగు, తెలుగు అని గొంతు చించుకుంటున్న ప్రముఖుల పిల్లలుగానీ, మనుమళ్లు గానీ ఎవరూ తెలుగు మీడియంలో ఎందుకు చదవడం లేదన్న ప్రశ్నకు ఎవరూ జవాబు ఇవ్వరు. 1950 నుంచి 1980 వరకు ప్రైవేటు రంగంలో విద్య పెద్దగా లేదు. ఎవరైనా చదువు కోవాలంటే వీధిబడో, ప్రభుత్వ పాఠశాలనో మాత్రమే ఉండేవి. కానీ కాలక్రమేణా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభు త్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు. పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడం సంగతి అలా ఉంచి, తెలుగులో చదవడమే అంతంతమాత్రంగా తయారైంది. సైన్స్, ఇతర సాంకేతిక పుస్తకాలు తెలుగులో అనువదించినా అర్థం కాని పరిస్థితి. 

మరో వైపు ప్రైవేటు స్కూళ్లలో మంచి విద్య ఇస్తున్నారన్న భావన, క్రమశిక్షణ ఉంటుందన్న అభిప్రాయం ఉండేది. అంతకుమించి ఇంగ్లిష్‌ మీడియం వల్ల తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని తల్లిదం డ్రులు నమ్మారు. అందువల్లే ముప్పై, నలభై ఏళ్ల క్రితం కొత్తగా పెట్టిన మిషనరీ స్కూళ్లకు విపరీతమైన గిరాకీ ఉండేది. కాస్త స్థోమత కలిగిన వారంతా ఆ స్కూళ్లలోనే చదువుకునేవారు. ఆ తర్వాత మెజారిటీ స్కూళ్లు ప్రైవేట్‌ రంగంలోనే స్థాపితమయ్యాయి. దాంతో ప్రభుత్వ స్కూళ్లు నిరుపేదల పిల్లలకే పరిమితం అయ్యాయి. ఇందులో సమా జంలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి.  

చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్లారు కదా, ఆయన తెలుగు మీడియంలోనే చదివారు కదా, పది వాక్యాలు ఆంగ్లంలో వాగ్దాటితో మాట్లాడగలరా అన్న ప్రశ్నను ఆయన రాజకీయ ప్రత్యర్థులు వేస్తుంటారు. ఆయన కుమారుడు లోకేష్‌ ఆంగ్లం బాగానే మాట్లాడగలరు. కాకపోతే తెలుగులో అంత ప్రావీణ్యత సాధించలేక పోయారు. దానికి కారణం చంద్రబాబేనని అనవచ్చా? లోకేష్‌ను తెలుగు మీడియంలో ఎందుకు చదివించలేదు? ప్రభుత్వ స్కూల్‌లో ఎందుకు వేయలేదని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? లోకేష్‌ కూడా వాడుక భాష గురించి సందేశం ఇచ్చారు. మరి ఆయన తన కుమారు డిని ఇప్పుడు ఎక్కడ చదివిస్తున్నది కూడా చెప్పి ఉంటే ఆదర్శంగా ఉండేది కదా! దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు పీజీ చేసి, లా కూడా చదివారు. తెలుగు మీడియంలోనే చదువుకో వడం వల్ల ఆంగ్లంలో ప్రావీణ్యుడు కాలేకపోయారు. పార్లమెంటులో ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఎన్నో తప్పులు దొర్లేవి. పాత్రికే యులు సరదాగా ఆయనతో ఈ విషయం ప్రస్తావిస్తే, ‘మనం ఏమైనా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివామా? నాకు వచ్చిన భాషతోనే మాట్లాడా’నని సరదాగా చెప్పేవారు. ఆయన పిల్లలు ఢిల్లీలో మంచి స్కూల్‌లో చదువుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు రామ్మోహన్‌ నాయుడు ఆంగ్లంలో ఎంత బాగా మాట్లాడ గలుగుతున్నారు! ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుందా, లేదా! జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన పిల్లలు ఓక్రిడ్జ్‌ స్కూల్‌లో చదువుకుంటు న్నారని గతంలో చెప్పినట్లు గుర్తు. అక్కడ తెలుగు మీడియం ఉందా, ఆంగ్ల మీడియం ఉందా? 

ఆయా దేశాలలో ఉండే కొందరు తెలుగువారు భాష గురించి కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ ఆ దేశాలలో వారి పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఏపీలో కానీ, తెలంగాణలో కానీ ఎంపీలు, ఎమ్మెల్యేల పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుతున్నారా? మరి సామాన్యుల విషయంలో మాత్రం కొందరు నేతలు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వీరే కాదు, కొందరు పత్రికాధిపతులు తాము తెలుగును ఉద్దరిస్తున్నామన్న ట్లుగా ప్రచారం చేసుకుంటుంటారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం పెద్ద, పెద్ద ఆంగ్లమీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారు. అలాకాకపోతే ఈ నేతలు కానీ, పత్రికాధిపతులు కానీ, ఉన్నతస్థానాలలో ఉన్నవారు కానీ గుండెమీద చేయి వేసుకుని తమ పిల్లలు తెలుగు మీడియంలోనే చదివారనో, ఇకపై చదివిస్తామనో చెప్పమనండి! అంతేకాదు, తెలుగు గురించి ఇన్ని చెప్పేవారు తాము స్థాపించిన స్కూళ్లను ఆంగ్ల మీడియంలో ఎందుకు నడుపుతున్నారంటే దానికి జవాబు ఉండదు.  ఆచరించి చూపితేనే వాటికి విలువ ఉంటుంది. చెప్పేటందుకే నీతులు అన్నట్లు వ్యవహరిస్తే ప్రజలు అర్థం చేసుకోలేని అమాయకులా?

తెలంగాణలో ఈ మధ్య డిగ్రీ క్లాసులకు అడ్మిషన్లు అడిగినవారిలో తొంభై శాతం మంది ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో వారికి తెలుసు కనుకే అలా ఎంపిక చేసుకున్నారు. అంత మాత్రాన వారికి తెలుగు రాదని, రాకూడదని కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మీడియంను చిన్న తరగతుల నుంచే ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. ఇంతవరకు అనేక ప్రైవేటు స్కూళ్లలో అసలు తెలుగే లేకపోయినా ఎవరూ అడగలేదు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం అనగానే ఏదో కొంప మునిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ఆయా సబ్జెక్టు లలో ఇంగ్లి్లష్, తెలుగులలో ఒకే పుస్తకంలో పాఠ్యాంశాలు ఇస్తోంది. ఇది తెలుగును పరిరక్షించినట్లు కాదా! పిల్లలకు మరింత సులువుగా ఉండే మార్గం కాదా! ‘నాడు–నేడు’ కింద స్కూళ్లను వేల కోట్ల వ్యయంతో బాగుచేస్తున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. దానికి తోడు ఆంగ్ల మీడియంను కూడా జోడిస్తుండటంతో సుమారు ఆరు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో పెరిగారు. దానిని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

గిడుగు రామ్మూర్తి పంతులు తీసుకు వచ్చిన వాడుక భాష వల్ల తెలుగుకు మేలు కలిగింది. అందులో సందేహం లేదు. కానీ ఆయన తెలుగులోనే చదవండి, మరే భాష నేర్చుకోవద్దు అని చెప్పలేదు. వర్తమాన సమాజంలో ఏది మంచో, ఏది కాదో ప్రజలకు తెలుసు.  దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర దేశాలకు వెళ్లాలన్నా ఆంగ్ల మాధ్యమమే కీలకం అన్న సంగతి పదే, పదే చెప్పనక్కర్లేదు.   తెలుగు తప్పనిసరిగా నేర్చుకోండి, కానీ ఆంగ్లంలో చదువుకోండి అన్న నినాదం తెలుగువారికి ఎంతైనా మేలు చేస్తుందని చెప్పాలి.

వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
ప్రముఖ జర్నలిస్ట్‌   

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top