వైభవంగా నృసింహ మహా యజ్ఞం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నృసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన కొచ్చెర్లకోట సత్యవేంకట లక్ష్మీనరసింహం గురుజీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన రుత్వికులు, పండితులు పాల్గొని, ఈ యజ్ఞ క్రతువును వైభవోపేతంగా నిర్వహించారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహుడికి ఈ యజ్ఞం జరపడం వల్ల లోకశాంతి చేకూరుతుందని పండితులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన పలు కార్యక్రమాలతో సుందరగిరి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ, మండపారాధనలు, అనంతరం శాలిగ్రామ అభిషేకం, లక్ష బిల్వార్చన, సూర్య నమస్కారాలు, మృత్తిక లింగార్చన, ఏక బిల్వార్చన, సహస్ర లింగార్చన, మహా లింగార్చన, 365 లింగాలకు పార్ధివ మహాలింగార్చన, 121 పార్ధివ లింగార్చన, కలశారాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠాపనా కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు.
వైభవంగా నృసింహ మహా యజ్ఞం


