తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్‌లో ఎన్నికలుంటాయని గత నెల 16న ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది మొదలు అలుముకున్న ఒక రకమైన యుద్ధ వాతావరణం పరిసమాప్తమైంది. పశ్చిమ బెంగాల్‌లో బుధవారం ముగిసిన రెండో దశ పోలింగ్‌లో అనుకున్నట్టే భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. సాయంత్రానికల్లా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలవరకూ చూస్తే దాదాపు అన్ని సర్వే సంస్థలూ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం ఖాయమని తెలిపాయి. తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతూనే డీఎంకే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని అయిదు సంస్థల్లో మూడు అంచనా వేయగా, ఒక సంస్థ అన్నాడీఎంకే–బీజేపీ కూటమివైపు మొగ్గింది. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయని సర్వేలు తేల్చాయి. ఆరు సంస్థల్లో రెండు తృణమూల్‌వైపు, మిగిలిన సంస్థలు బీజేపీవైపు మొగ్గాయి. వాస్తవ ఫలితాలకు ఇవి ఏమేరకు దగ్గరగా ఉంటాయన్నది వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతగానీ తెలియదు.
పోలింగ్ వరకూ చూస్తే మిగిలినచోట్ల దాదాపు ప్రశాంతంగానే ముగిసినా పశ్చిమ బెంగాల్ ఎప్పటిలాగే తనదైన ముద్ర మిగిల్చింది. రెండు దశల్లోనూ హింసాత్మక ఘటనలు తప్పలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన హింస చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. కావొచ్చు... కానీ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో దాదాపు రెండున్నర లక్షలమంది బలగాలను మోహరించటం, ముఖ్యంగా రెండో దశ పోలింగ్ జరిగిన దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భద్రతా బలగాలు అతిగా ప్రవర్తించిన తీరు సబబు కాదు. ఒకరి హింసకు మరొకరి హింస ప్రత్యామ్నాయం కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట ఏకంగా 91 లక్షలమంది ఓటర్ల పేర్లు గల్లంతు కావటం, ఎక్కడెక్కడికో పనుల కోసం వలసపోయినవారు తిరిగొచ్చి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా తగిన పత్రాలు సంపాదించలేకపోవటం, దాఖలు చేసినవారు సైతం భంగపడటం ఎందరినో కలవరపెట్టింది. చివరకు తొలి దశలో 139 మంది, మలి దశలో 1,468 మంది మాత్రమే న్యాయసమీక్షలో ఓటుహక్కు పొందారు.
ఇక ఈసీ వివాదాస్పద పాత్ర సరేసరి. ముఖ్యంగా బెంగాల్‌లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించటం కోసం తాను తటస్థంగా వ్యవహరించాలన్న సంగతిని అది మరిచింది. ఈ ఎన్నికల బరిలో తానూ ఉన్నానన్నట్టు వ్యవహరించింది. నిజానికి 2024 ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఈ పోకడలు కనబడ్డాయి. అధికారుల బదిలీలు మొదలుకొని అనేక అంశాల్లో విపక్షం చెప్పినట్టల్లా ఈసీ ఆడిందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు బెంగాల్‌లో అది మరింత బాహాటంగా జరిగింది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన ఒకరిద్దరు బెదిరింపు ధోర ణిలో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. అందులో ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’గా మీడియా చెబుతున్న యూపీకి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఏ అభ్యర్థి అయినా సక్రమంగా వ్యవహరించకపోతే, డబ్బు పంచుతుంటే లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చట్టం అనుమతించిన మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బహిరంగ సవాళ్లు దేనికి? ఇది మంచి సందేశాన్ని పంపదు.
ఇతరచోట్ల గణనీయమైన విజయాలు సాధిస్తున్నా... బీజేపీకి మాతృసంస్థ అనదగ్గ జనసంఘ్‌కు నారూ నీరూ పోసిన స్వర్గీయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన బెంగాల్‌లో అది సాధించలేకపోతున్నామని మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్‌పేయి ఒక దశలో ఆవేదన వ్యక్తం చేశారంటారు. ఆయన తొలినాళ్లలో ముఖర్జీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనైనా అదెంతవరకూ సాకారమవుతుందన్న విషయంలో ఎవరి అంచనాలు వారివి. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న ముఖ్యమంత్రి మమతకు దీటుగా నిలబడగల స్థానిక నాయకులు ఇంతవరకూ బీజేపీకి తారసపడలేదు. అందుకే ప్రచార బాధ్యతల్ని స్వయంగా నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మోయాల్సివచ్చింది. అక్కడొచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాలక, విపక్షాల వ్యూహాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపగలవనటంలో సందేహం లేదు.


