జైల్లో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్‌ మృతి

Gangster Mukim Kala Among 3 Prisoners Killed in Shootout at UP Chitrakoot Jail - Sakshi

ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్‌ జైలులో చోటు చేసుకున్న ఘటన

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చిత్ర‌కూట్ జైలులో ఖైదీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగి కాల్పుల‌కు దారితీసింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు హ‌త‌మ‌య్యారు. ఇద్దరు ఖైదీలను తోటి ఖైదీ కాల్చి చంపడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గ్యాంగ్ వార్ ఘటనపై నివేదక అందజేయాలని డివిజనల్ కమిషనర్ డీకే సింగ్, చిత్రకూట్ ఐజీ, జైళ్ల శాఖ డీఐజీ సంజీవ్ త్రిపాఠిలను ఆదేశించారు. మృతి చెందిన ఖైదీలను అన్షు దీక్షిత్, మిరాజుద్దీన్ అలియాస్ మిరాజ్ అలీ, ముకీం కాలాగా పోలీసులు ప్రకటించారు.

మిరాజ్ అలీ, ముకీం కాలాని అన్షు దీక్షిత్ తుపాకీతో కాల్చి చంపేశాడు. మరికొందరు ఖైదీల తలకు తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దీక్షిత్ ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి సత్యనారాయణ్ తెలిపారు. అయితే జైల్లోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందరూ కరుడుగట్టిన నేరస్తులని.. వారిపై చాలా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే ఈ ఘటనపై జిల్లా జైలర్ ఎస్పీ త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఖైదీల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో సిబ్బంది ఆపేందుకు యత్నించారని.. ఆ సమయంలో దీక్షిత్ జైలు అధికారి రివాల్వర్ లాక్కుని తోటి ఖైదీలపై కాల్పులు జరిపాడని అన్నారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో దీక్షిత్ చనిపోయాడని చెప్పారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో గ్యాంగ్ వార్ కారణంగానే కాల్పుల ఘటన చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

యూపీలోని షామ్లీకి చెందిన ముకీం కాలా హత్యలు, దోపిడీలు, వసూళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్‌ ముక్తార్ అన్సారీ ముఠాలో మిరాజ్ అలీ కీలక సభ్యుడిగా తెలుస్తోంది. సీతాపూర్‌కి చెందిన కాంట్రాక్ట్ కిల్లర్ అన్షు దీక్షిత్ గతంలో గ్యాంగ్ స్టర్ మున్నా బజరంగి వద్ద పనిచేసినట్లు సమాచారం. మిరాజ్ అలీని మార్చి 20న వారణాసి జైలు నుంచి చిత్రకూట్ జైలుకి మార్చారు. కాలాని సహరాన్‌పూర్ నుంచి ఈ నెల 7న ఇక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. దీక్షిత్ 2019 నుంచి ఇదే జైలులో ఉంటున్నాడు.

చదవండి: ఆస్పత్రిలో పక్కా ప్లాన్‌: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top