తండ్రి కళ్లేదుటే దారుణం... పక్షవాతంతో చెప్పలేని దీనస్థితి

Assassinated Married Women At Vizanagaram - Sakshi

రామభద్రపురం: మండల పరిధిలోని ముచ్చర్లవలస గ్రామంలో ఓ వివాహిత   శనివారం హత్యకు గురైంది. ఈ సంఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గ్రామానికి చెందిన దాలి రమణమ్మ(35) ఇంట్లో ప్రవేశించి కర్రతో తల వెనుక భాగాన కొట్టడంతో బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో కింద పడి ఉంది. శనివారం తెల్లవారు జామున టీవీ పెద్ద శబ్దం రావడం, లైట్‌ వేసి ఉండడంతో పక్కింటి వారు వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిచి ప్రథమ చికిత్స చేయించారు.

అనంతరం బాడంగి సీహెచ్‌సీకి తరలించగా వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.  విజయనగరం కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న సీఐ శోభన్‌బాబు, ఎస్సై కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి పరిశీలించారు. సీఐ శోభన్‌బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ రమణమ్మది హత్యగానే భావిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.  అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి వద్ద డాగ్‌   ఆగడంతో ఆ వ్యక్తిని రప్పించి విచారణ చేస్తామని తెలిపారు. 

హతురాలి నేపథ్యం  
..రమణమ్మకు తెర్లాం మండలం ఎంఆర్‌  అగ్రహారానికి చెందిన రామారావుతో విహహం జరగగా భర్త పదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉండగా ఐదేళ్ల క్రితం కుమారుడు మృతిచెందాడు. హతురాలి  తల్లి చిన్నమ్మ, తండ్రి పైడితల్లి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకోగా తల్లి ప్రస్తుతం ఎంఆర్‌ అగ్రహారంలో ఉంటోంది. ముచ్చర్ల వలసలో ఉంటున్న తండ్రి పైడితల్లికి పక్షవాతం సోకడంతో రమణమ్మ తన కూతురిని తల్లి వద్ద ఉంచి  రెండేళ్ల క్రితం తండ్రికి సేవలందించేందుకు ముచ్చర్లవలస గ్రామానికి వచ్చి ఉంటోంది.

శుక్రవారం రాత్రి  ఈ సంఘటన తండ్రి కళ్ల ముందే జరిగినా పక్షవాతంతో  బాధపడుతుండడంతో ఏం జరిగిందో? ఎలా జరిగిందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే పోలీసులు మాత్రం వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏమైనా హత్య జరిగి ఉండవచ్చా అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. రమణమ్మ మృతితో  కుమార్తె మౌనిక ఒంటరిదైపోయింది.

(చదవండి:  సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top