బడుల్లో సౌకర్యాల కల్పనకే ‘విద్యాంజలి’
రొంపిచెర్ల : విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే విద్యాంజలి ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా డీవైఈఓ ఇందిర అన్నారు. ఆమె గురువారం రొంపిచెర్ల బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యాంజలి పథకం ద్వారా పాఠశాలలకు అవసరమైన వసతులను దాతల నుంచి సేవా కార్యక్రమాల రూపంలో ఏర్పాటుచేసి విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుందన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రయాణాల పెంపునకు సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దాతలు తమకు తోచిన రీతిలో పాఠశాలలకు సహకారం అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అమర్‌శేఖర్, రవీంద్రనాథ్, సుజాత, రెడ్డిప్రదీప్, చిన్నయ్య, ధనలక్ష్మి, హరినాయక్, రెడ్డి రమేష్, వెంకటరమణా రెడ్డి, సీఆర్‌ఎంటీ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


