Ukraine War: రష్యాలో చిక్కుకుపోయిన దేశీ ఆయిల్‌ కంపెనీల ఆదాయం

Ukraine war crisis: Almost Rs 1,000 crore of Indian oil firms stuck in Russia - Sakshi

రష్యాలో చిక్కుబడిపోయిన 

రూ. 1,000 కోట్ల డివిడెండ్‌ ఆదాయం   

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్‌ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. విదేశాలకు డాలర్లను పంపడంపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఆయిల్‌ కంపెనీలకు రావాల్సిన 8 బిలియన్‌ రూబుళ్ల (రూ. 1,000 కోట్ల) మేర డివిడెండ్‌ ఆదాయం చిక్కుబడిపోయింది.  

‘ఇన్వెస్ట్‌ చేసిన ప్రాజెక్టుల నుంచి మాకు తరచుగా డివిడెండ్‌ వచ్చేసేది. కానీ, ఉక్రెయిన్‌తో యుద్ధంతో విదేశీ మారకం రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి డాలర్లను ఇతర దేశాలకు పంపడంపై రష్యా ఆంక్షలు విధించింది. ఫలితంగా భారత కన్సార్షియంకు రావాల్సిన దాదాపు 8 బిలియన్‌ రూబుళ్ల డివిడెండ్‌ ఆదాయం రష్యాలో ఆగిపోయింది‘ అని ఆయిల్‌ ఇండియా డైరెక్టర్‌ హరీష్‌ మాధవ్‌ తెలిపారు.     యుద్ధం మొదలు కావడానికి ముందు డివిడెండ్‌ ఆదాయం అంతా వచ్చేసిందని, కానీ ఆ తర్వాత నుంచి ఆగిపోయిందని పేర్కొన్నారు. అయితే, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పరిస్థితి చక్కబడిన తర్వాత నిధులు తిరిగి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమ పెట్టుబడులపై రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావమేమీ లేదని ఓఐఎల్‌ (ఆయిల్‌ ఇండియా) చైర్మన్‌ ఎస్‌సీ మిశ్రా తెలిపారు.  

ఓఐఎల్, ఐవోసీ, ఓఎన్‌జీసీ విదేశ్‌ తదితర దేశీ చమురు కంపెనీలు రష్యాలో నాలుగు వేర్వేరు అసెట్లలో 5.46 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేసాయి. వాంకోర్‌నెఫ్ట్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ క్షేత్రం లో 49.9 శాతం, టీఏఏఎస్‌–యూర్యాఖ్‌ క్షేత్రంలో 29.9 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఆయా క్షేత్రాల గ్యాస్, చమురు విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై డివిడెండ్లు అందుకుంటున్నాయి.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top