అమెరికా ఎఫెక్ట్‌.. ఆ షేర్ల జోరు అదిరింది! | Sakshi
Sakshi News home page

Stock Market: అమెరికా ఎఫెక్ట్‌.. ఆ షేర్ల జోరు అదిరింది!

Published Thu, Jul 28 2022 7:21 AM

Stock Market: Sensex 548 Pts  High Bull Returns - Sakshi

ముంబై: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు రాణించడంతో పాటు యూరప్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఏషియన్‌ పెయింట్స్, ఎల్‌అండ్‌టీ, మారుతీ, టాటా స్టీల్‌ తదితర కీలక కంపెనీల కార్పొరేట్‌ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్‌ 548 పాయింట్లు పెరిగి 55,816 వద్ద స్థిరపడింది. ఈ సూచీలో 30 షేర్లలో మూడు మాత్రమే నష్టపోయాయి.

నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 16,642 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. విస్తృతస్థాయిలో మధ్య తరహా షేర్లకు అధిక డిమాండ్‌ నెలకొనడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఒకశాతం ర్యాలీ చేసింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.40% పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 437 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.712 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 13 పైసలు క్షీణించి 79.91 స్థాయి వద్ద స్థిరపడింది.

ఫెడ్‌ పాలసీ ప్రకటనకు ముందు(బుధవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. క్యూ1లో నికర లాభం 45 శాతం వృద్ధి చెందడంతో ఎల్‌అండ్‌టీ షేరు 2.5% పైగా లాభపడి రూ.1,797 వద్ద ముగసింది.  ప్రతి రెండు షేర్లకు ఒక షేరు (1:2) చొప్పున బోనస్‌గా ఇచ్చేందుకు బోర్డు అనుమతినివ్వడంతో గెయిల్‌ షేరు రెండుశాతం లాభంతో రూ.147 వద్ద నిలిచింది.

  

Advertisement
 
Advertisement
 
Advertisement