సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌పై బేర్‌ పంజా.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌పై బేర్‌ పంజా.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు

Published Wed, Jan 17 2024 9:05 AM

Stock Market Rally On Market Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 211 పాయింట్లు దిగజారి 21,820కు చేరింది. సెన్సెక్స్‌ 755 పాయింట్లు నష్టపోయి 72,373 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా బాండ్‌ ఈల్డ్‌లు మంగళవారం 13 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4.07 శాతానికి చేరాయి. యూరప్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ఫెడ్‌ కీలక వడ్డీరేట్లకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వస్తున్న సంకేతాలు ఎన్నిరోజులు కొనసాగుతాయో తెలియదని చెప్పారు. కేవలం కొంతకాలాన్నే పరిగణించి ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం పుంజుకోదని సూచించారు. దాంతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గుతాయో లేదోనని మార్కెట్లు కొంత సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికితోడు పుట్‌కాల్‌ రేషియో(పీసీఆర్‌)లో కూడా ఎక్కువ అంతరాలు ఉండడంతో మార్కెట్‌లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

డాలర్‌ ఇండెక్స్‌ 0.89 శాతం పెరిగి 103.31 కు చేరింది. క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 77.87 డాలర్లుగా ఉంది. ఎఫ్‌ఐఐలు మంగళవారం ఈక్విటీ మార్కెట్‌లో రూ.656.57 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.369.29 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. సోమవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా 22,000 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్‌ కూడా 73,000 పాయింట్ల ఎగువన ముగిసింది. తాజాగా అయిదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1972.72 పాయింట్లు, నిఫ్టీ 584.45 పాయింట్లు చొప్పున పరుగులు తీశాయి. ఫలితంగా బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.9.68 లక్షల కోట్లు వృద్ధి చెంది  జీవనకాల తాజా గరిష్ఠమైన రూ.376.09 లక్షల కోట్లుగా నమోదైంది.

గత ఏడాది నవంబరులో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సామాజిక భద్రతా పథకంలో 15.92 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. దాదాపు 20,830 కొత్త సంస్థలు ఇందులో నమోదైనట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 15.92 లక్షల మందిలో 7.47 లక్షల మంది 25 ఏళ్ల వయసులోపు వారే ఉన్నారు. మహిళా సభ్యులు నికరంగా 3.17 లక్షల మంది చేరారు. ఇది భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత సానుకూల అంశంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.

2023 డిసెంబరులో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠమైన 0.73 శాతంగా నమోదైంది. ఆహార ధరలు పెరగడం ప్రభావం చూపింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు ప్రతికూలంగా ఉన్న ద్రవ్యోల్బణం.. నవంబరులో 0.26 శాతానికి చేరింది. 2022 డిసెంబరులో టోకు ద్రవ్యోల్బణం 5.02 శాతంగా ఉంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement