మరో సంచలనం.. బాహుబుల్ 60000

Sensex closes above 60,000 mark, Nifty ends at 17,853 - Sakshi

కొనసాగిన రికార్డుల పండుగ

సెన్సెక్స్‌ 163 పాయింట్లు  అప్‌

17850 పైన ముగిసిన నిఫ్టీ

రాణించిన ఆటో, ఆర్థిక, ఐటీ షేర్లు

ముంబై: స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం మరో సంచలనం చోటుచేసుకుంది. సెన్సెక్స్‌ సూచీ తన 42 ఏళ్లలో సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. కొంతకాలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. ఆర్‌బీఐ సరళతర ద్రవ్య విధానానికి కట్టుబడింది. ప్రపంచ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్‌తో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అన్ని రంగాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. దీంతో దలాల్‌ స్ట్రీట్‌ కొన్ని వారాలుగా కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది.

మార్కెట్లో పండుగ వాతావరణం...  
దేశీయ మార్కెట్‌లోని సానుకూలతలతో స్టాక్‌ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 274 పాయింట్ల లాభంతో 60 వేలపైన 60,159 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 17,897 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలు ఆరంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించడంతో స్టాక్‌ మార్కెట్లలో పండుగ వాతావరణం కనిపించింది. ఆటో, ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌లో కొంతసేపు మినహా రోజంతా 60 వేల స్థాయిపైనే ఉంది. ఇంట్రాడేలో 448 పాయిం ట్లు పెరిగి వద్ద 60,315 జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది.

చివరికి 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల స్థాయిని అందుకునే ప్రయత్నం చేసినా... గరిష్టాల వద్ద నిరోధం  ఎదురవడంతో ఈ స్థాయిని అందుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్‌లో 125 పాయింట్లు పెరిగి 17,948 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్‌ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పో యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

సూచీలకు ఐదోవారామూ లాభాలే...
బుల్‌ రన్‌లో భాగంగా సూచీలు ఐదోవారమూ లాభాలను గడించాయి. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 1033 పాయింట్లు, నిఫ్టీ 268 పాయింట్లు ఎగిశాయి.

సెన్సెక్స్‌ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్‌ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్‌ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది.     
    – అశిష్‌కుమార్‌ చౌహాన్, బీఎస్‌ఈ ఎండీ, సీఈవో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top