మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్‌బీఐ అభ్యంతరం ఏమిటి?
స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్‌ఫోలియోపై ఆర్‌బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్‌బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్‌కు ఉండాల్సిన సమతుల్య లోన్ బుక్ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ సలహా ఇచ్చింది.
యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.
ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు


