Telangana: భూముల విలువ పెంపు!

Gearing Up Value Of Property Registration In Telangana - Sakshi

ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణకు ప్రతిపాదన 

తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా మార్పులు.. సాగు భూముల విలువలు 4 రెట్లు పెంపు 

ప్రాంతాల ప్రాధాన్యతనుబట్టి విలువల నిర్ధారణ

ఏటా రూ.3,400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా 

సీఎం అంగీకరిస్తే ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే అమల్లోకి.. 

రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించి ఎనిమిదేళ్లవుతోంది. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. 
ప్రతి రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్‌ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. 
రాష్ట్రంలో జరిగిన పాలనా సంస్కరణల కారణంగా.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు ఏర్పడ్డాయి. రియల్‌ బూమ్, రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు ముందుకు వచ్చింది. 
2019–20 లెక్కల ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,299 కోట్లు ఆదాయం వచ్చింది. కొత్త విలువలు అమల్లోకి వస్తే ఇది రూ.9,600 కోట్ల వరకు చేరొచ్చని అంచనా.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ (కార్డ్‌ వ్యాల్యూ) పెంపునకు రంగం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల కేటగిరీల్లో 30 శాతం నుంచి 400 శాతం వరకు పెరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ వద్దకు ప్రతిపాదనలు చేరాయని.. ఆయన అంగీకరిస్తే ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. సవరణలు జరిగితే ప్రభుత్వానికి ఏటా సగటున రూ.3,400 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది. రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు పెరిగితే మరింత అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

శాస్త్రీయ పద్ధతిలో అంచనాలతో.. 
భూముల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించే దిశలో ప్రభుత్వం కసరత్తు చేసింది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన మ దింపు ఆధారంగా.. 2019–20 ఆర్థిక సంవత్సరం లో జరిగిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సగటును తీసుకుని లెక్కలు గట్టింది. సర్వే నంబర్ల వారీగా భూములు, నంబర్ల వారీగా ఇళ్లు, వెంచర్లను బట్టి ఫ్లాట్లు, ఖాళీ స్థలాల విలువలను నిర్ధారించే ప్రయ త్నం జరిగింది. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర, అంతర్‌ జిల్లా రహదారులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను నిర్ధారించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. 

కమిటీలు లేకుండానే ప్రక్రియ.. 
ప్రభుత్వ విలువల సవరణకు సంబంధించి గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కన్వీనర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసేవారు. అందులో ప్రాంతాన్ని బట్టి మున్సిపాలిటీ, హెచ్‌ఎం డీఏ, పంచాయతీరాజ్, ప్లానింగ్‌ అధికారులు సభ్యులుగా ఉండి మదింపు చేసేవారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఆయా జిల్లాల్లోని ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల విలువల సవరణ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేవారు. కానీ ఈసారి కమిటీలు ఏర్పాటు కాకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ప్రభుత్వం నిర్ణయించి నట్టు సమాచారం. గతంలో పలుమార్లు ఈ కమిటీల ఏర్పాటు ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ కస రత్తు చేసి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం అంగీకరించక పోవడంతో రిజిస్ట్రేషన్‌ విలువ లు మార్చలేదు. అయితే తాజాగా రాష్ట్ర ఆదాయా న్ని పెంచే దిశగా చర్యలు చేపట్టిన సర్కా రు రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై దృష్టి పెట్టింది. కాస్త జాప్యం జరిగినా కొత్త విలువలు ఈ ఏడాది చివరిలో గా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top