ఆర్‌బీఐ బులెటిన్
పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్‌బీఐ బులెటిన్ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.
పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్‌లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్‌బీఐ బులెటిన్ తెలిపింది.
ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్‌లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్‌లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్‌ను రూపొందించిన ఆర్‌బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు.


