'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ | Anant Ambani Appeals To Colombia To Save 80 Hippos | Sakshi
Sakshi News home page

'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ

Apr 28 2026 3:27 PM | Updated on Apr 28 2026 3:54 PM

Anant Ambani Appeals To Colombia To Save 80 Hippos

కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో.. ఒక పర్యావరణ సమస్య తలెత్తింది. ఇక్కడ సుమారు 200 వరకు హిప్పోపొటమస్‌లు జీవిస్తున్నాయి. వీటి వల్ల స్థానిక జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతపై ప్రభావం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆపాలని అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వంతారా స్థాపకులు అయిన అనంత్ అంబానీ.. హిప్పోలను చంపాలనే నిర్ణయం సరికాదని వెల్లడించారు. జంతువులను చంపడం కంటే, వాటిని సురక్షితంగా మరో ప్రదేశానికి తరలించడం ఒక మంచి పరిష్కారం అని అన్నారు. ఈ విషయంపై కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్‌కు ఒక లేఖ రాశారు.

అనంత్ అంబానీ రాసిన లేఖలో.. 80 హిప్పోపొటమస్‌లను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారాకు తరలించవచ్చని, ఇక్కడ జంతువులకు అనుకూలమైన సహజ వాతావరణం, వైద్య సదుపాయాలు, శాశ్వత సంరక్షణ అందుబాటులో ఉంటాయని చెప్పారు. జంతువులను చంపడం కంటే.. ఇది సరైన ప్రత్యామ్నాయం అని అన్నారు.

''ఆ ఎనభై హిప్పోలు తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేదు, అలాగే తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా సృష్టించుకోలేదు'' కాబట్టి వాటిని చంపడం తగదు. సురక్షితమైన పరిష్కారం ద్వారా వాటిని కాపాడే సామర్థ్యం మనకు ఉంటే, ప్రయత్నించాల్సిన బాధ్యత మనపై ఉందని అనంత్ అంబానీ అన్నారు.

వంతారా గురించి
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా, ప్రపంచంలోనే అతిపెద్ద. అత్యంత అధునాతన వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ.. పరిరక్షణ కేంద్రాలలో ఒకటి. అనంత్ అంబానీ దీనిని 3000 ఎకరాల్లో (కృత్రిమ అడవి) ఏర్పాటు చేసి.. జంతువులకు రక్షిస్తున్నారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement