ధనుస్సు రాశి ఫలాలు 2022-23

Sri Subhakrut Nama Samvatsara Sagittarius Horoscope 2022-23 - Sakshi

ఆదాయం–2 

వ్యయం–8 

రాజయోగం–6  

అవమానం–1

మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)
ఉత్తరాషాఢ 1వ పాదము (బే)

సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (తృతీయం)లోను తదుపరి మీనం (చతుర్థం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (ద్వితీయం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (షష్ఠం) కేతువు వృశ్చికం (వ్యయం)లోను తదుపరి రాహువు మేషం (పంచమం) కేతువు తుల (లాభం)లో సంచరిస్తారు. 

2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (షష్ఠం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా చాలావరకు గ్రహానుగ్రహం బాగుందనే చెప్పాలి. మంచి పనులు చేసే అవకాశం చాలాసార్లు వస్తుంది. మీరు సద్వినియోగం చేసుకుంటారు. సంవత్సరంలో ఎక్కువకాలం కుజుడు అనుకూలిస్తున్న కారణంగా మనోబలంతో విజయాలను అందుకుంటారు. శ్రమ ఎక్కువ అయినా, ప్రతి ప్రయత్నంలోనూ లాభాలు ఎక్కువగా వస్తాయి. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు.

మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతాయి. తరచుగా శరీరం సొంపును గాంభీర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సానుకూలమే. ఋణ సంబంధమైన అంశాలలో మీరు నిబద్ధతతో సంచరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. కుటుంబసభ్యుల సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి విషయంలో మంచి వార్తలు వింటారు. తరచు విందు వినోదాలు, శుభ, పుణ్యకార్యాల్లో కాలక్షేపం చేశారు. స్వేచ్ఛగా సంచరిస్తారు. కొన్నిసార్లు రోజువారీ పనులు కూడా ఆలస్యమవుతాయి. గురువులను దర్శించుకుంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది.

కొత్త ప్రయోగాలు చేయడానికి వచ్చే మంచి అవకాశాలలను వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారులకు క్రమంగా సమస్యలు తగ్గుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభపడతారు. ఉద్యోగులకు రోజురోజుకు శుభపరిణామాలు ఉంటాయి. గత సమస్యలు తీరతాయి. చక్కగా విధి నిర్వహణ చేస్తారు. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఉన్న మొండి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యవంతులైన ఈ రాశివారు ముందు జాగ్రత్తలు పాటించి సమస్యలు పెరగకుండా సుఖజీవనం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగవంతమవుతాయి. కావలసిన వనరులు చేకూరుతాయి.

నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా పూర్తవుతాయి. శ్రమ తక్కువ ఫలితం పూర్తి సానుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి  అన్ని కోణాల్లో మంచి సహకారం అంది కార్యజయం కలుగుతుంది. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు బహు సుఖవంతమైన కాలము. ఒత్తిడి లేకుండా వ్యాపారం చేస్తారు. విద్యార్థులకు అంతటా విజయమే. పోటీ పరీక్షలలో కూడా శుభపరిణామాలు ఉంటాయి.  రైతులకు విజయపరంపరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గర్భిణిలు మంచిఫలితాలను అందుకుంటారు. 

మూల నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు విశేషంగా లాభిస్తాయి. అయితే పుత్రవైరం పెరిగే అవకాశం వుంటుంది. తరుచుగా మీ కులాచార ఉత్సవాలు నిమిత్తంగా బంధుమిత్రులను కలుసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యవసాయం బాగా లభిస్తుంది.

పూర్వాషాఢ నక్షత్రం వారికి భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు పెరుగుతాయి. అవసరానికి డబ్బు సర్దుబాటు కాని పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి విషయంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. విందు వినోదాలు పుణ్యక్షేత్ర సందర్శనల నిమిత్తంగా ప్రయాణాలు, ధనవ్యయం తప్పవు.

ఉత్తరాషాఢ నక్షత్ర ఉద్యోగులకు ఉన్నతస్థితి వుంటుంది. అధికారులు ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తారు. తరచు చురుకుగా తెలివితేటలు ప్రదర్శిస్తారు. చేసే ప్రయత్నాలన్నీ అనుకున్న దానికంటే ముందుగానే పూర్తవుతాయి. చాలా మంచి కాలం.

శాంతి: అంతా సుఖవంతమే అయినా పంచముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా పనులు మరింత వేగవంతమవుతాయి. రోజూ విçష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ఏప్రిల్‌: ఏలినాటి శని పూర్తవుతుంది. ఈ నెలలో కొన్ని పనులు వేగంగా పూర్తయి ఆనందంగా ఉంటారు. కొత్త వ్యవహారాలపై దృష్టి వుంచవద్దు. ఆరోగ్యం అనుకూలం. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. ప్రతి పనీ స్వబుద్ధితో సానుకూలం చేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది.

మే: కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఋణ సమస్యలు తీరతాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య పుణ్యకార్యాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.

జూన్‌: సమస్యాకాలంలో కూడా తెలివిగా ప్రవర్తించి, లాభదాయక ఫలితాలు పొందుతారు. ఈ నెల అంతా ప్రతి పనిలోనూ ఖర్చులు ఎక్కువవుతాయి. రోజు రోజుకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సిబ్బంది సమస్య బాగా పెరుగుతుంది. ప్రత్యేకంగా పూర్వాషాఢ నక్షత్రం వారు అధిక జాగ్రత్తలు పాటించాలని సూచన.

జూలై: మంచికాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. అందరితోనూ స్నేహంగా ఉండవలసిన కాలం. మీ కార్యకలాపాలను చాలా గోప్యంగా ఉంచాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అధికంగా ఉంచాలి. కుటుంబ వ్యవహారాలు 15వ తేదీ నుంచి సానుకూలం అవుతాయి. అకాలంలో భోజనం చేయవలసి రావడం ఎక్కువసార్లు జరుగుతుంది.

ఆగస్టు: చాలా అద్భుతమైన కాలం. ప్రతి పనిలోనూ శ్రమ తక్కువగా ఉండి కార్యజయం పొందే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా కుటుంబ వాతావరణం బహు అనుకూలం. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అనుకూల స్థితి ఉంటుంది. సత్కాలక్షేపాలు జరుగుతాయి.

సెప్టెంబర్‌: కార్య సానుకూలతకు ఎక్కువగా కృషి చేస్తారు. గ్రహానుకూలత క్రమంగా పెరుగుతుంది. ప్రయత్నం చేసే పనులన్నీ సానుకూలం అవుతుండటంతో ఆనందంగా ఉంటారు. భక్తి కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనలతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులను తరచుగా కలుస్తూ ఉంటారు.

అక్టోబర్‌: మీ పనులను స్వయంగా చేసుకోండి. కుజుడు మినహా మిగిలిన గ్రçహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. 15 వరకు కుజుడు కూడా అనుకూల సంచారం చేస్తున్నారు. అన్ని వ్యవహారాలూ సానుకూలంగా ఉంటాయి. తొందరపాటు మాటతీరు ప్రదర్శించవద్దు. 

నవంబర్‌: మాసారంభంలో గ్రహానుగ్రహం బాగుంది. కొన్ని కొన్ని పనులను త్వరగా ఆరంభంలోనే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. ఇతరుల నుంచి సలహాలు సహకారం 15వ తేదీ నుంచి తీసుకోవద్దు. విద్యా వినోద పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. సాంఘిక కార్యక్రమాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు.

డిసెంబర్‌: స్వబుద్ధితో కార్యసాధన చేస్తారు. అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటారు. గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలం అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు వస్తున్నా, వాటిని బాగానే పరిష్కరించుకుంటారు. 

జనవరి: చక్కగా వ్యవహరించి తలపెట్టిన ప్రతిపనినీ విజయపథంవైపు నడపగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం, ఉద్యోగులకు ప్రమోషన్‌ ప్రయత్నాలు సానుకూలం. బంధుమిత్రుల రాకపోకలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు.

ఫిబ్రవరి: కొత్త ప్రయోగాలు 15వ తేదీ వరకు చేయవద్దు. నెలంతా అనుకూలం. 15 వరకు ఒకస్థాయి, 15వ తేదీ తరువాత విశేషస్థాయి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో మన్ననలు అందుకుంటారు. వ్యాపారులు తెలివిగా లాభాలు అందుకుంటారు. అన్ని అవసరాలూ తీరే కాలం. 

మార్చి: కుజగ్రహం జపం చేయించుకోండి. కుజుడు మినహా అన్ని గ్రహాలూ అనుకూలంగా ఉన్నందున ఈ నెలంతా మీకు మంచికాలమే. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.

మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర 2022 – 23:  మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top