గండికోట హత్య కేసు ఏమైందో! | - | Sakshi
Sakshi News home page

గండికోట హత్య కేసు ఏమైందో!

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

గండిక

గండికోట హత్య కేసు ఏమైందో!

● హత్య కేసులో అనుమానితులకు నార్కో అనాలిసిస్‌ పరీక్ష

సాక్షి ప్రతినిధి, కడప: గండికోటలో సుమారు 8 నెలల క్రితం జరిగిన బాలిక హత్య కేసు ఇంకా తేలలేదు. క్లూస్‌ టీమ్‌ పరిశీలించింది. డాగ్‌ స్క్వాడ్‌ పర్యటించింది. టవర్‌ లోకేషన్‌ తీశారు. ఫోన్‌ కాల్స్‌ టెక్నికల్‌ విశ్లేషణ చేశారు. ఇరువురు ఐపీఎస్‌ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో నలుగురు డీఎస్‌పీలు, నలుగురు సీఐలు, 10మంది ఎస్‌ఐలు ప్రత్యేక దృష్టి పెట్టారు. శరవేగంగా దర్యాప్తు చేపట్టారు. త్వరలో అసలు విషయం వెలుగు చూస్తుందని సమాజం భావించింది. పైగా ఘటన జరిగిన మరుసటి రోజు డీఐజీ కోయ ప్రవీణ్‌ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రంలోగా నిందితుల్ని పట్టుకుంటామని మీడియా సాక్షిగా చెప్పారు.

● ఏమైందో..ఏమో! సాయంత్రాలెన్నో వెళ్లాయి.. రోజులు గడిచాయి.. నెలలు దాటుతున్నాయి.. ఇప్పటికీ హత్య కేసులో పురోగతి లేదు. సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్యోదంతం నేపధ్యంలో ఒక్కమారుగా గండికోట మైనర్‌ బాలిక హత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 8నెలలు పూర్తయినా ఇప్పటికీ హత్య చేసిందెవరు? హత్య చేయడానికి కారణాలు ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నార్థకంగానే ఉండిపోయాయి.

నిర్ధారణ కాకముందే స్పందించిన డీఐజీ...

బాలిక హత్య కేసులో కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ తొందరపాటు చర్య స్పష్టంగా కన్పిస్తోంది. అప్పటి ఎస్పీ ఆశోక్‌కుమార్‌తో పాటు ఘటన స్థలానికి చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్‌ తొందరగా నిర్ధారణకు వచ్చారు. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్‌ ప్రమేయం లేదని ప్రకటించారు. అంతటితో ఆగకుండా సాయంత్రం నిందితుల్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ హత్య వివరాలు తెలియజేస్తారని అప్పట్లో మీడియాకు వివరించారు. హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే డీఐజీ స్థాయి అధికారి అలా ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.

మదనపల్లెలో చిన్నారి

హత్యోదంతం నేపఽథ్యంలో...

మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్య మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఓ దుర్మార్గుడి వ్యవహారమే అందుకు కారణమని స్థానికులు నిర్ధారణకు వచ్చారు. తక్షణమే తమకు అప్పగించాలని బాధిత కుటుంబం పక్షాన మదనపల్లె పట్టణం ఏకతాటిపైకి వచ్చింది. నిరాటంకంగా ఆందోళన చేపట్టింది. పోలీసు అధికారులు నచ్చజెప్పినా శాంతించలేదు. ఇలాంటి సున్నిత ఘటనలు తలెత్తితే అంతే వేగంగా పోలీసుల చర్యలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

● పుంగనూరు టౌన్‌లో ఏడేళ్ల చిన్నారి ఆదృశ్యం తర్వాత సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో 10రోజులకు మృతదేహం లభించింది. ఈఘటన గత ఏడాది సెప్టెంబర్‌ 24న చోటుచేసుకుంది. అదృశ్యం వ్యవహారం వెలుగులోకి రాగానే అన్నీ కోణాల్లో దర్యాప్తు ఆశించిన వేగంగా లేకపోవడమే మైనర్‌ బాలిక మృతికి ఆస్కారం ఏర్పడిందనే భావన అక్కడి ప్రజానీకంలో ఉంది. బాలికలు, మహిళల అదృశ్యం వ్యవ హారాల్లో సత్వరమే చర్యలు చేపడితే పోలీసు వ్యవ స్థ మీద మరింత విశ్వాసం పెరుగుతోంది. అలా కాకుండా ఉదాసీనతతో వ్యవహరిస్తే మదనపల్లెలో ఘటనలాగా బాధితులు ఆందోళన దిగడం సహజమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

8నెలలు గడుస్తున్నా కేసులో లభించని పురోగతి

ఘటన రోజు సాయంత్రంలోగానిందితుల్ని పట్టుకుంటామన్న డీఐజీ

ఇప్పటికీ తేలని హత్య కేసు వ్యవహారం

జమ్మలమడుగు రూరల్‌: ‘గండికోట’ బాలిక హత్య కేసులో అనుమానితులైన ఇద్దరిని జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్‌ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది గుజరాత్‌ రాష్ట్రానికి నార్కో అనాలసిస్‌ పరీక్షకు తీసుకెళ్లినట్లు సమాచారం. 4 నెలల క్రితం కోర్ట్‌ అనుమతితో నాగేంద్ర, కొండయ్య, బాలిక స్నేహితుడు లోకెష్‌ను పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ను పోలీస్‌ అధికారులు విజయవాడకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు నార్కో అనాలిసీస్‌ పరీక్షకు తీసుకెళ్లినట్లు సమాచారం.

గండికోట హత్య కేసు ఏమైందో! 1
1/1

గండికోట హత్య కేసు ఏమైందో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement