సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను సీఎం చంద్రబాబు తన బినామీలకు, కుటుంబ సభ్యులకు అడ్డగోలుగా ధారాదత్తం చేస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. అందులో భాగంగానే మంత్రి లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్శిటీకు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు.
ఈ భూదోపిడీని అడ్డుకుని చెక్ పెడతామని వారు హెచ్చరించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా పెట్టి ఆ సంస్థకు వాటిని క్రమబద్దీకరించడమే కాక ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న గీతం యాజమాన్యం తీరును నిరసిస్తూ బుధవారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్ హాజరయ్యారు.
రుషికొండలో టీటీడీ ఆలయం నుంచి గీతం కాలేజి వద్దకు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. రెండున్నర గంటలపాటు బైఠాయించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలని నినదించారు. పైగా.. గతంలో 70 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఇప్పుడు 54.79 ఎకరాలు తీసుకున్న గీతం, 25 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా విద్యార్థులకు ఉచిత సీట్లు ఇవ్వడంలేదంటూ గుడివాడ అమర్‌నా«థ్, కేకే రాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారిరువురూ ఏమన్నారంటే..
గీతం భూకబ్జాపై పోరాటం ఆగదు..
గీతం యూనివర్శిటీ భూదోపిడీని వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటుంది. 30 ఏళ్లుగా గీతం దోపిడి చేస్తోంది. ఇప్పటివరకూ అక్కడ ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి కూడా ఉచితంగా చదవలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.5 వేల కోట్ల విలువైన గీతం ఆక్రమిత 54.79 ప్రభుత్వ భూమిని కాపాడితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్ళీ కబ్జాకు తెగబడ్డారు. ప్రభుత్వ భూములను క్రమబద్దీకరణ చేసుకున్నందున ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం ఫ్రీ సీట్లు కేటాయించాలి. కానీ ఆ పరిస్థితిలేదు. గీతం భూకబ్జాపై పెద్దఎత్తున పోరాటం చేస్తాం.
విశాఖ ప్రజలు ఎంపీ భరత్‌కు ఐదు లక్షల మెజారిటీ ఇస్తే ఆయన రూ.5 వేల కోట్లు భూమి కబ్జా చేశారు. 2004లో నాటి సీఎం చంద్రబాబు 70 ఎకరాల భూమి క్రమబద్ధీకరించారు. ఇప్పుడు మళ్లీ 55 ఎకరాలు క్రమబద్దీకరించారు. మొత్తంగా గీతంకు రూ.12 వేల కోట్ల భూమి కట్టబెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.35 వేల కోట్ల అవినీతి జరిగింది. ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే మా నాయకుడే మా పోరాటంలో భాగస్వామ్యులవుతారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, రాష్ట్ర అధికారప్రతినిధి కొండా రాజీవ్, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.


