పెంచిందంతా పెండింగ్‌లోనే..!

What Is Electricity True Up Charges Discoms Asks For Clarity - Sakshi

2014-19 మధ్య లెక్కలేని విద్యుత్తు కొనుగోళ్లు

కమిషన్‌ నియంత్రణరేఖను దాటిన గత సర్కార్‌

పెరిగిన భారం తడిసిమోపెడు

రూ.19,604 కోట్లు ఇంకా పెండింగ్‌

ఏపీఈఆర్‌సీ ముందు కొత్త సవాల్‌

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ట్రూ-అప్‌ చార్జీలపై ఐదేళ్లుగా స్పష్టత లేకపోవడంతో రూ.19,604 కోట్ల మేర ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో డిస్కమ్‌లు అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. 2021-22 వార్షిక ఆదాయ, అవసర నివేదికలను ఈ నెలాఖరులోగా పంపిణీ సంస్థలు విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాలి. ఈ నేపథ్యంలో ట్రూ-అప్‌ సంగతేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై సరైన స్పష్టత ఇవ్వాలని డిస్కమ్‌లు ప్రభుత్వాన్ని కోరాయి. 

ఏంటీ ట్రూ-అప్‌!

  • విద్యుత్‌ సంస్థల ఖర్చును నియంత్రిస్తూ, దేనికి ఎంత ఖర్చు పెట్టాలనే ఆదేశాలతో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ) ప్రతీ ఏటా టారిఫ్‌ ఆర్డర్‌ ఇస్తుంది. అందుకు లోబడే సంస్థలు ఖర్చు చేయాలి. కానీ 2014-15 నుంచి 2018-19 వరకూ గత ప్రభుత్వం నియంత్రణ రేఖను దాటింది. 
  • అధికంగా చేసిన ఖర్చుకు కారణాలు వివరిస్తూ కమిషన్‌ అనుమతి కోసం మరుసటి సంవత్సరం డిస్కమ్‌లు పిటీషన్‌ ఫైల్‌ చేస్తాయి. దీన్నే ట్రూ-అప్‌ అంటారు. 2014-19 మధ్య కాలంలో ఇలా ఫైల్‌ చేసిన మొత్తం రూ.19,604 కోట్లు. దీన్ని అనుమతిస్తే టారిఫ్‌ రూపంలో ప్రజలపైనే భారం వేయాలి. 
  • ఖర్చు అనవసరం అని భావిస్తే కమిషన్‌ దాన్ని అనుమతించకూడదు. ఏపీఈఆర్‌సీ దీనిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా ఇదంతా తమకు రావాల్సిన బాకీ అని డిస్కమ్‌లు భావిస్తున్నాయి. దీనికోసం అప్పులు చేశామని చెబుతున్నాయి. దానికి ప్రతీ ఏటా వడ్డీ చెల్లిస్తున్నామంటున్నాయి. 

ఖర్చు ఎందుకు పెరిగింది?

  • మార్కెట్లో చౌక విద్యుత్‌ లభిస్తున్నా.. ఎక్కువ రేటుకు విద్యుత్‌ ఇచ్చే ప్రైవేట్‌ సంస్థలనే ప్రభుత్వం ప్రోత్సహించింది. మరో పక్క ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల నుంచి విద్యుత్‌ బిల్లులు వసూలు చేయలేకపోయారు.
  • 2014-15 వరకూ విద్యుత్‌ కొనుగోలుకు కమిషన్‌ అనుమతికి మించి రూ.451 కోట్లు అదనంగా ఖర్చు చేస్తే.. 2015-17లో రూ.2,580, 2017-18లో రూ.2,577 కోట్లు, 2018-19లో రూ.3,990 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్లలోనూ భారీ తేడా వచ్చింది. 2014-15 నుంచి 2018-19 మధ్య రూ.5,259 కోట్లు వసూలు చేయలేదు. ఇందులో చాలా వరకూ ప్రభుత్వ సంస్థల బాకీలే ఉన్నాయి. విద్యుత్‌ కొనుగోళ్ల భారం, వసూలు కాని బకాయిలు పెరిగి పెరిగి రూ.19,604 కోట్లకు చేరింది. 

ప్రస్తుత ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తోంది
అడ్డగోలుగా విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారానికి లెక్కలు చెప్పకపోవడం గత ప్రభుత్వ నిర్వాకమైతే, ఇన్నేళ్లూ ట్రూ-అప్‌ సంగతి తేల్చకపోవడం శోచనీయం. గత ప్రభుత్వం చేసిన చర్యకు ప్రస్తుత ప్రభుత్వం జవాబు చెప్పాల్సి రావడం ఇబ్బందే. 
- ఎ.పున్నారావు, విద్యుత్‌రంగ నిపుణుడు
  

విద్యుత్‌ కొనుగోళ్ల భారం, వసూలు కాని బకాయిల వివరాలు: 
 

సంవత్సరం ఎంత? (రూ. కోట్లలో)
2014-15     861
2015-16 3,958
2016-17     7,186
2017-18     3,257
2018-19 4,342
మొత్తం 19,604

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top