ఐటీ పార్క్‌కు అంజుమన్–ఎ–ఇస్లామియా భూములు
మంగళగిరి నియోజకవర్గం చినకాకానిలోని 71.57 ఎకరాలపై గురి
లేఖ రాసిన మంత్రి లోకేశ్.. నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో వక్ఫ్ భూములు చేజారుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ప్రత్తిపాడు మండలం కొత్తమల్లాయపాలెం 232–1 సర్వే నంబరులోని 226.78 ఎకరాలు, 232–2 సర్వే నంబరులోని 7 ఎకరాలు మొత్తం 233.18 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్కు కోసం తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చినకాకానిలో అంజుమన్–ఎ–ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాలను కూడా కేటాయించేందుకు పావులు కదులుతున్నాయి.
లోకేశ్ పేషీ నుంచి గతంలో వచ్చిన లేఖ మేరకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపడుతున్నారు. భూ సేకరణ చట్టం–2013 కింద 71.57 ఎకరాల వక్ఫ్ భూమి ప్రభుత్వం కోరుతోందని ఆదివారం ప్రాథమిక ప్రకటన ఇచ్చారు. దీనిపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే వక్ఫ్ సీఈవోగా పనిచేసిన ప్రభుత్వ అధికారితో పాటు తెనాలి సబ్ కలెక్టర్, గుంటూరు వక్ఫ్ ఇన్‌స్పెక్టర్–ఆడిటర్‌తో పాటు పలువురు అధికారులు చినకాకాని భూములను పరిశీలించారు.
» ప్రత్తిపాడు నియోజకవర్గంలో 233 ఎకరాల వక్ఫ్ భూమిని ఐటీ పార్కుకు కేటాయించారు. గుంటూరు జిల్లాలో భూసేకరణకు సహకరించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కలెక్టర్‌ను కోరడంతో భూసేకరణ అధికారిగా గుంటూరు ఆర్డీవోను నియమించారు. ఆయన సర్వే చేయించి పాటు పాతమల్లాయ్యపాలెంలో 209.86 ఎకరాలు, ప్రత్తిపాడులో 105.86 ఎకరాల పట్టా భూములు తీసుకునేందుకు ప్రాథమిక అంచనాలను పంపారు.
అందులో ఉన్న 233.18 ఎకరాలు గుంటూరులో ఔరంగజేబు కాలంలో నిర్మించిన పెద్దమసీద్‌కు చెందిన వక్ఫ్ భూమి. ఇక్కడ ఎకరం ధర రూ.2 కోట్లపైనే ఉంది. ఈ భూమిని తీసుకోవాలంటే పెద్ద మసీదు ముతవల్లీ కమిటీ తీర్మానం చేసి వక్ఫ్ బోర్డుకు పంపించాలి. తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివేదించి ఆమోదం తీసుకుంటారు.
» మలేసియా కంపెనీ ప్రతినిధులు నవంబర్ 4న వచ్చి చూశారు. ఇక్కడ నెవర్ సెండాయ్ ఇంజనీరింగ్ సంస్థ ప్రతి
నిధులు ఫ్యాబ్రికేషన్ సమీకృత శిక్షణ సంస్థను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు స్థలాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత మసీదు, అంజుమన్ సంస్థలకు చెందినవి కావడం గమనార్హం. రాష్ట్ర వక్ఫ్ పాలకవర్గ సభ్యులుగా, మైనారిటీ శాసన వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడైన ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ ఉన్నారు. ఆయన అండతోనే ఈ భూమిని కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మేం రోడ్డున పడతాం
90 ఏళ్లుగా మా తాతల నుంచి కౌలు చేస్తున్నాం. దీనిపై ఆధారపడి పలువురు రైతులు బతుకుతున్నారు. 72 ఎకరాలలో 55 మంది రైతులు కౌలుకు తీసుకోగా, మరికొందరు సబ్‌లీజుతో పంటలు పండిస్తున్నారు. మాకు ఈ స్థలం ఇచ్చి నప్పుడు పెద్ద చెరువు. దాన్ని పూడ్చి బోర్లు వేసి, కరెంట్ కనెక్షన్ తీసుకుని పంటలు సాగు చేశాం. ఇప్పుడు ఉన్నపళంగా ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. పంటలు వేసుకున్నామని చెబుతున్నా వినడం లేదు. – పాలడుగు రవికుమార్, రైతు


