ఇక తిరుమలలో ఆ చెట్లు కనిపించవు!

TTD TO Cut Down Acacia Xotic Plants In Tirupathi - Sakshi

తిరుమల: శేషాచలం కొండల్లో దట్టంగా విస్తరించిన ఆస్ట్రేలియా సంతతికి చెందిన అకేషియా చెట్లను తొలగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. గతంలో వేగంగా పెరుగుతాయని ఈ చెట్లను నాటిన టీటీడీ ఇప్పుడు వీటి వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందన్న బయోడైవర్సిటీ బోర్డు సూచనల మేరకు వీటిని తొలగించనుంది. శేషాచలం కొండల్లో టీటీడీ పరిధిలో 3 వేల హెక్టార్ల అటవీ స్థలం ఉండగా 800 హెక్టార్లలో అకేషియా చెట్లు ఉన్నాయి. వీటిని అంచెలవారీగా తొలగించి.. వాటి స్థానంలో సంప్రదాయ చెట్లను నాటాలని టీటీడీ భావిస్తోంది.  

1,000 ఎకరాల్లో శ్రీగంధం చెట్లు 
గతానికి భిన్నంగా ప్లాంటేషన్‌ విధానంలో గత ఐదేళ్ల నుంచి టీటీడీ మార్పులు తెస్తోంది. శ్రీవారి కైంకర్యానికి వినియోగించేందుకు అనువుగా ఉంటాయని ఇప్పటికే పార్వేటి మండపానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో 1,000 ఎకరాల్లో విడతల వారీగా శ్రీగంధం చెట్లను నాటింది. మరో 25 ఎకరాల స్థలంలో వివిధ రకాల సంప్రదాయ చెట్లను పెంచుతోంది. వీటిలో ఉసిరి, మామిడి, అరటి, జమ్మి, మారేడు, సపోటా, సీతాఫలం, రామఫలం, లక్ష్మణఫలం, కదంబ, పనస, పొగడ, మనోరంజితం, రుద్రాక్ష వంటివి ఉన్నాయి. ఇక శ్రీవారి మూలమూర్తికి పుష్ప కైంకర్యం కోసం ఐదెకరాల్లో పూల చెట్లను పెంచుతోంది. ఇప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తోన్న అకేషియా చెట్లను తొలగించి.. వాటి స్థానంలో పురాణాల్లో విశేషంగా వర్ణించిన చెట్లను పెంచాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం పది నుంచి పదిహేను రకాల మొక్కలను ఎంపిక చేసింది. ఇప్పటికే ఘాట్‌ రోడ్డుల్లో టీటీడీ పెంచిన పలు పూల చెట్లు ప్రయాణికులు, యాత్రికులను ఆహ్లాదపరుస్తున్నాయి. 

వేగంగా విస్తరించిన.. ‘అకేషియా’ 
1990లో వేగంగా పెరుగుతాయని 2 వేల ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ అటవీ సిబ్బంది అకేషియా చెట్లను నాటారు. ఊహించినట్టుగానే ఇవి శేషాచలం కొండల్లో బాగా విస్తరించాయి. ఇప్పుడు ఇదే టీటీడీకి సమస్యగా మారింది. అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యంలో మార్పు రావడంతోపాటు చెట్ల కింద భూసాంద్రత దెబ్బతింటోందని బయోడైవర్సిటీ బోర్డు పరిశోధనలో తేలింది. ఆ చెట్ల కింద పీహెచ్‌ వాల్యూ 4.5 శాతానికి పడిపోయిందని.. భూమిలో ఆమ్లాల శాతం కూడా ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఈ మేరకు బయోడైవర్సిటీ బోర్డు టీటీడీకి నివేదిక సమర్పించింది. సుమారు రెండు వేల ఎకరాల్లో ఉన్న చెట్లను నరికివేయడం ఇష్టం లేకపోయినా.. వాటి వల్ల జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని గ్రహించి విడతలవారీగా వాటిని తొలగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top