బొల్లవరంలోని ప్రభుత్వ భూమి
ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో 9.68 ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాదీనం
1979లో మళ్లీ ఎస్సీలకు పంపిణీ
వారు సాగు చేయకుండా అమ్ముకోవడంతో పట్టాలు రద్దు
వ్యూహం ప్రకారం ఇదే భూమిని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్కెచ్
తెరవెనుక రాష్ట్ర ముఖ్యనేత సహకారంతోనే చక్రం తిప్పుతున్న నేతలు
సాక్షి టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు అతిపెద్ద పట్టణంగా ఉంది. ఈ మున్సిపాలిటీకి 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడున్న భూములు, స్థలాలు ఎక్కువ ధర పలుకుతుండడంతో రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి స్కెచ్ వేశారు. వివరాలివీ.. మున్సిపాలిటీ పరిధిలోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుక ఈ ప్రభుత్వ భూమి ఉంది.
పట్టణంలోని బొల్లవరానికి చెందిన రైతు బద్వేలు సత్యనారాయణరెడ్డికి పెద్దమొత్తంలో భూములు ఉండడంతో అప్పట్లో ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌తో నిబంధనల కన్నా ఎక్కువున్న భూమిని ప్రభుత్వం సేకరించింది. 1968లో సత్యనారాయణరెడ్డి కొనుగోలు చేసిన భూమిని 1975లో స్వాధీనం చేసుకుని 1979లో ఎస్సీలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రామేశ్వరం, చౌటపల్లె, దొరసానిపల్లె గ్రామాలకు చెందిన తొమ్మిది మంది ఎస్సీలకు 497/1, 497/2, 467/6, 497/7, 497/8, 172/1, 172/3, 172/4, 491/1, 490/5, 490/6, 196/4 సర్వే నంబర్లలోని 9.68 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.

2007 జనవరి 6న ఎస్సీ రైతులకు ఫాం–1 నోటీసు ఇచ్చిన తహసీల్దార్ , 1985 జనవరి 10న భూములను నడిపి సుబ్బన్నకు అమ్మిన ఎస్సీ రైతులు రిజిస్ట్రేషన్ పత్రం
ఎస్సీలైన పబ్బతి పుల్లయ్య, పబ్బతి చిన్న పుల్లయ్య, పబ్బతిæ బాలపుల్లయ్య, పొట్టిగాళ్ల సత్యరాజు, కడియం లక్ష్మీనరసమ్మ, చింతాకు వెంకటసుబ్బమ్మ, ఉక్కిసాల చిన్నక్క, రామేశ్వరం లలితమ్మ, మేకల శిలాసు, ఎర్రమాసు శిరోమణమ్మలకు తాత్కాలిక డీకేటీ పట్టాలను పంపిణీ చేశారు. వీరు పంట సాగు చేయడంతోపాటు ఏడాదికి రూ.470 పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ, వీరు పంటలు సాగుచేయకపోవడం, ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో పాటు 1985 జనవరి 10న ఈ భూమిని రామేశ్వరానికి చెందిన నడిపి సుబ్బన్న (అగ్గిరాముడు), పెద్దసుబ్బన్న తదితరులకు అమ్ముకున్నారు. అప్పట్లోనే ఈ భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేశారు.
పట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం..
ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీరు సాగుచేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని కొంతమంది అప్పట్లోనే ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణ జరిపించారు. పట్టాలు పొందిన రైతులకు 2007 జూన్ 1న ఫాం–1 నోటీసు జారీచేశారు. భూములు తీసుకున్న తర్వాత ఎందుకు సాగుచేయలేదని, ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించలేదని, దీనికి 15 రోజుల్లోపు సమాధానం చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
పంటలు సాగు చేయకపోవడంతోపాటు పన్ను చెల్లించకపోవడం, పైగా చట్ట విరుద్ధంగా భూమిని అమ్మి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో అప్పట్లోనే కలెక్టర్ వీరి పట్టాలను రద్దుచేశారు. ఏపీ అసైన్‌మెంట్ ల్యాండ్స్–1977లోని సెక్షన్–3 సబ్‌సెక్షన్ క్లాజ్(2) ప్రకారం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది.
కోర్టును ఆశ్రయించిన ఎస్సీలు..
ఈ నేపథ్యంలో.. కొంతమంది ఎస్సీలు కోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక డీకేటీ పట్టాలు కాకుండా తమకు శాశ్వత పట్టాలు పంపిణీ చేయాలని, పాస్‌పుస్తకాలూ ఇవ్వాలని కోరారు. ఏళ్ల తరబడి ఈ విచారణ సాగింది. మరోవైపు.. విలువైన ఈ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకోవాలనే లక్ష్యంతో బద్వేలు సత్యనారాయణరెడ్డి వ్యూహం పన్నినట్లు సమాచారం. భావితరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరం వరకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయకూడదని 2012 జూన్ 18న ప్రభుత్వం జీఓ జారీచేసింది.
నగరాలు, మున్సిపాలిటీలతోపాటు మేజర్ పంచాయతీ హెడ్‌క్వార్టర్ పరిధిలో కూడా ఈ నిబంధనలను పాటించాలని అందులో పేర్కొన్నారు. పరిశ్రమలతోపాటు వాణిజ్య అవసరాలకు కూడా భూములను పంపిణీ చెయ్యొద్దని తెలిపారు. ఈ నిబంధనల ఆధారంగా 2020 జూన్ 24న కలెక్టర్ హరికిరణ్ నివేదికను కోర్టుకు సమర్పించడంతో కోర్టులో రైతుల వ్యాజ్యాన్ని కొట్టేశారు.
రైతులను మభ్యపెట్టి...
సర్వే నంబర్ 497తోపాటు మిగిలిన భూమలున్నీ బొల్లవరం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయి. ఈ భూమి అంతా మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. చుట్టూ ప్లాట్లు వేసి వెంచర్లు వేసి ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో.. సుమారు రూ.150 కోట్ల విలువైన 9.68 ఎకరాల భూమిని తిరిగి హస్తగతం చేసుకునేందుకు వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే చౌటపల్లె, దొరసానిపల్లె గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు లక్ష్మిరెడ్డి, అరవ మునివరలను ముందుపెట్టి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం.
అలాగే వ్యూహం ప్రకారం 1985లో ఈ భూమి కొనుగోలు చేసిన నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న కుమారులకు రూ.60 లక్షలు ఇచ్చి ఇటీవల లోక్ అదాలత్‌లో కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అంతేకాక.. పూర్వం తాత్కాలిక డీకేటీ పట్టాలు పొందిన ఒక్కో రైతుకు కూడా రూ.10 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. రైతులు తిరిగి తహసీల్దార్‌ను సంప్రదించి తమకు శాశ్వత డీకేటీ పట్టాలు ఇవ్వడంతోపాటు పాస్‌పుస్తకాలు ఇవ్వాలంటూ వినతిపత్రం సమర్పించాలని భావిస్తున్నారు.
అధికారుల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే కోర్టును ఆశ్రయించి తద్వారా ఈ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుని అమ్ముకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేతోపాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ప్రభుత్వంలోని కీలక యువనేతను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ భూములన్నీ ప్రస్తుతం డీకేటీ జాబితాలో ఉన్నాయి. మాజీ సర్పంచ్‌లు లక్ష్మిరెడ్డి, అరవ మునివరలను ముందుపెట్టి ఎమ్మెల్యే, ఆయన తనయుడు ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


