ఆక్సిజన్‌ కోసం ఒడిశాకు ట్యాంకర్లు

Tankers to Odisha for oxygen - Sakshi

గన్నవరం నుంచి విమానంలో పంపిన రాష్ట్ర ప్రభుత్వం

పర్యవేక్షించిన కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ప్రత్యేకాధికారి ఎంటీ కృష్ణబాబు  

సాక్షి, అమరావతి/విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల కోసం ఒడిశాలోని అంగూల్‌ నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకునేందుకు శనివారం రెండు ఖాళీ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం కార్గో విమానంలో భువనేశ్వర్‌కు పంపించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ–17 విమానం గన్నవరం నుంచి ఖాళీ ట్యాంకర్లతో మధ్యాహ్నం బయల్దేరి వెళ్లింది. ఈ ఏర్పాట్లను రాష్ట్ర కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ప్రత్యేకాధికారి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆక్సిజన్‌ అవసరాలు తీర్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌.. కేంద్రంతో మాట్లాడి మిలట్రీకి చెందిన కార్గో విమానాలను రాష్ట్రానికి రప్పించారని చెప్పారు.

మన రాష్ట్రానికి 470 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని తెలిపారు. చెన్నై, బళ్లారి, ఒడిశా, విశాఖతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీల నుంచి ఆక్సిజన్‌ను సమకూరుస్తున్నట్లు వివరించారు. రోజుకు రెండు ట్యాంకర్లు గానీ లేదంటే రెండు రోజులకు 4 ట్యాంకర్లను గానీ విమానాల ద్వారా పంపించి ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తీసుకువస్తామని చెప్పారు. శనివారం పంపించిన రెండు ట్యాంకర్ల మొత్తం కెపాసిటీ 46 మెట్రిక్‌ టన్నులని తెలిపారు. ఒడిశాలో నింపిన ఆక్సిజన్‌ ట్యాంకర్లను తిరిగి రాష్ట్రానికి గ్రీన్‌ చానల్‌ ద్వారా తీసుకువస్తామన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి షన్‌మోహన్‌తోపాటు ఎయిర్‌పోర్టు అథారిటీ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు, ఆపరేషన్‌ మేనేజర్‌ అంకిత్‌ జైస్వాల్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top