షాపింగ్‌ ట్రెండ్‌ మారింది

Shopping trend Is Changed - Sakshi

నిత్యావసరాలు, అత్యవసరాలకే ఖర్చు చేస్తున్న జనం

ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం, భారత్‌లో 80 శాతం మార్పు

ఆరోగ్యం, శుభ్రత, ఫిట్‌నెస్, వెల్‌నెస్‌కే ఎక్కువ డబ్బు వినియోగం

హోమ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌కి ప్రాధాన్యత

రెస్టారెంట్లు, దుస్తులు, నగల జోలికెళ్లని జనం

కోవిడ్‌ నేపథ్యంలో 45 దేశాల్లో మెకెన్సీ సంస్థ సర్వే

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఈ మార్పు షాపింగ్‌లో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మనసు పడ్డామనో, కొత్త ట్రెండ్‌ అనో గతంలో వస్తువులను కొనుగోలు చేసిన జనం.. ఇప్పుడు నిత్యవసరమో, అత్యవసరమో అయితేనే జేబులోంచి డబ్బు తీస్తున్నారు. ఈ కరోనా కాలంలో ఆదాయాలు తగ్గిపోవడంతో అనవసరమైన వస్తువుల జోలికి వెళ్లడం లేదు.

మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే షాపింగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. కోవిడ్‌–19 నేపథ్యంలో వినియోగదారులు వేటిపైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే దానిపై మెకెన్సీ అండ్‌ కంపెనీ భారత్‌తో పాటు 45 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా షాపింగ్‌ ట్రెండ్‌ 60 శాతం మారగా మన దేశంలో అది 80 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. 70 శాతం మంది గతంలో మాదిరిగా వస్తువులు కొనుగోలు చేయడంలేదు. 

సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.. 
► ముందుచూపుతో ఉన్నవారు విలాస వస్తువుల కొనుగోలు తగ్గించేశారు.  
► ఎక్కువ మంది ఈ–కామర్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా తమకు అవసరమైన వాటిని కొంటున్నారు. 
► దీంతో అన్ని కేటగిరీల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ పది శాతం పెరిగింది.  నమ్మకమైన బ్రాండ్‌లు మాత్రమే కొనేవారు ఇప్పుడు తక్కువకు దొరికే కొత్త బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నారు.
► ఆరోగ్యరక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.  విహార యాత్రలు, ప్రయాణాలు మానుకోవడంతో పాటు జనం ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్లడం తగ్గించేశారు.
► మన దేశంలో ఇంట్లో అవసరమైన వస్తువులు, ఆరోగ్య రక్షణ వస్తువులకు 30 నుంచి 39 శాతం ఖర్చు చేస్తున్నారు. కిరాణా వస్తువులపై 15 నుంచి 29 శాతం, ఫిట్‌నెస్, వెల్‌నెస్, పెట్‌కేర్‌ సేవలకి 15 నుంచి 29 శాతం డబ్బు వెచ్చిస్తున్నారు. వ్యక్తిగత రక్షణ, మద్యం, పుస్తకాలు, వాహనాల కొనుగోళ్లకు ఒకటి నుంచి 14 శాతం ఖర్చు చేస్తున్నారు.
► రెస్టారెంట్లపై పెట్టే ఖర్చు గతం కంటే 50 శాతానికిపైగా తగ్గిపోయింది. 
► ఫుట్‌వేర్, దుస్తులు, నగలు, గృహోపకరణాలపైనా 50 శాతం ఖర్చు తగ్గింది. 
► షాపింగ్‌ ట్రెండ్‌ అమెరికాలో 75 శాతం, యూకేలో 71 శాతం, ఫ్రాన్స్‌లో 59 శాతం, జర్మనీలో 54 శాతం, స్పెయిన్‌లో 68 శాతం, ఇటలీలో 65 శాతం, భారత్‌లో 80 శాతం, జపాన్‌లో 33 శాతం, కొరియాలో 64 శాతం, చైనాలో 82 శాతం మారాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top