హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది పొన్నవోలు
ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి
అరెస్ట్‌పై ఆందోళన అక్కర్లేదని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్‌కుమార్‌రెడ్డి రిమాండ్‌ను తిరస్కరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసిన తరువాత కూడా వారి అరెస్ట్‌కు పోలీసులు ప్రయత్నాలు చేశారని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అలా అయితే ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఆదేశించారు.
దీనిపై ఈ నెల 29వ తేదీన పూర్తి స్థాయిలో వాదనలు వింటానని తెలిపారు. అప్పటి వరకైనా కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్‌రెడ్డి అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ‘కుప్పం కోర్టు ఆదేశాల అమలును మాత్రమే నిలుపుదల చేశాం తప్ప, వాటిని రద్దు చేయలేదు. అందువల్ల శ్రీహరి, గిరీష్ లను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అవసరం లేదు’ అని పునరుద్ఘాటించారు.
ఈ నేపథ్యంలో శ్రీహరి, గిరీష్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను సవా లు చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణరావు కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి.


