వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనం అందించారని ఒంటిమిట్ట అర్చకులకు నోటీసులు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీటీడీ కేంద్రంగా జగన్‌పై కుట్రలు, కుతంత్రాలు
ఇందుకు కొనసాగింపుగానే వైఎస్ జగన్‌పై మరోమారు అక్కసు
ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పలుమార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్
ఆ విషయాన్ని మరచి టీటీడీ పెద్దల రాద్ధాంతం
వైఎస్ జగన్ మాజీ సీఎం అని మరచిపోయి మరోమారు దిగజారుడు రాజకీయం
ఇటీవల ఓ కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ పోలీసు ఉన్నతాధికారికి వేద ఆశీర్వాదం చేయించిన టీడీపీ నేతలు
ఒంటిమిట్ట నుంచి కర్నూలుకు తీసుకెళ్లి మరీ ఆశీర్వాదం
ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలూ బట్టబయలైనా టీటీడీ చైర్మన్‌పై మాత్రం చర్యలు నిల్
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుకు టీటీడీ వేద ఆశీర్వచనం ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్న నెటిజన్లు
సాక్షి, అమరావతి : రాజకీయాలకు తావే ఉండకూడని గుళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు రోజుల క్రితం టీటీడీ అనుబంధ ఒంటిమిట్ట ఆలయంలో పనిచేసే అర్చకులు వేద అశీర్వచనం చేయడంపై వివరణ కోరుతూ ప్రభుత్వ పెద్దలు టీటీడీ ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పించడం కలకలం రేపింది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టు బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చినా చర్యలు చేపట్టకపోగా కనీసం వివరణ కూడా కోరలేదు.
కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులపై చర్యలు చేపట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తిరుమల కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఇటీవల కాలంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను సైతం దెబ్బతీసేలా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగానే అర్చకులకు నోటీసులు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది.
దిగజారుడు రాజకీయం
ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో టీటీడీ సహా వివిధ ఆలయాల నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం అందజేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గ, మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కూడా తమ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ అర్చకులను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల రాజంపేట నియోజకవర్గంలో ఓ మండల టీడీపీ నేత అనుచరులు ఒక ఎస్సీ యువకుడిపై దాడి చేశారు.
ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తమ్ముడు, మండల టీడీపీ నేతలు ఒంటిమిట్ట ఆలయ అర్చకులను కర్నూలు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఆఫీసుకు తీసుకెళ్లి.. ఆ అధికారికి వేద ఆశీర్వచనం చేయించారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నేతలు.. అర్చకులు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వేద ఆశీర్వచనం చేయడం తప్పన్నట్లు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై కనీస ఆలోచన లేకుండా టీటీడీ పెద్దలు అర్చకులకు నోటీసులతో ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చేయలేదా?
ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అర్చకులు వివిధ సందర్భాల్లో వేద ఆశీర్వచనం ఇవ్వడం సాధారణం అని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు అప్పటి టీటీడీ అ«ధికారులు వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించడంతో పాటు వస్త్రం కూడా అందజేశారని గుర్తు చేస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఎవరికైనా ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని, అయినా అప్పుడు చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆ గౌరవం అందించడం కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపే అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.


