అంబేడ్కర్‌ జయంతిలోపే విగ్రహం పూర్తి

Ministers Committee review construction work of Ambedkar statue - Sakshi

125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను సమీక్షించిన మంత్రుల కమిటీ

విగ్రహ నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయండి 

ఏపీ ఐఐసీకి మంత్రుల కమిటీ ఆదేశం 

సాక్షి, అమరావతి: అంబేడ్కర్‌ జయంతికి ముందే 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను పూర్తిచేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారుల్ని ఆదేశించారు. నిర్ణీత సమయానికి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు, అధికారులతో కూడిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు కమిటీ మంగళవారం తాడేపల్లిలోని ఎస్సీ గురుకులం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది.

మంత్రి మేరుగ నాగార్జునతో పాటు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవగా పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. విగ్రహ నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు పనులను ఏపీఐఐసీ అధికారులు వేగంగా పూర్తిచేయాలన్నారు.

మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ 12.5 అడుగులు, 25 అడుగుల అంబేడ్కర్‌ నమూనా విగ్రహాల్లో కమిటీ సూచించిన మార్పులను చేయాలని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటులో సమస్యలుంటే కమిటీ దృష్టికి తీసుకురావాలని, వాటిని సీఎం సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ముఖాకృతి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

విగ్రహం ముఖాకృతిని 125 అడుగుల విగ్రహానికి తగిన సైజులో మట్టితో నమూనా రూపొందిస్తామని శిల్పి నరేష్‌కుమార్‌ చెప్పారు. అనంతరం కమిటీ అనుమతితో కాంస్య విగ్రహ తయారీని ప్రారంభిస్తామన్నారు. నమూనా విగ్రహాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందం ఢిల్లీలోని తమ స్టూడియోకు రావాలని కోరారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు వర్చువల్‌గా హాజరైన ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, డైరెక్టర్‌ హర్షవర్ధన్, ఏపీఐఐసీ, కేపీసీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.నికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయండి     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top