సోదరుడు చిరంజీవితో కలిసి బోటు నడిపిన మంత్రి

Minister Appalaraju Went To Fishing During Dussehra festival - Sakshi

చేపల వేటకెళ్లిన మంత్రి అప్పలరాజు

చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన సీదిరి

స్వగ్రామం దేవునల్తాడలోనే దసరా పండుగ

సాక్షి, శ్రీకాకుళం: నిత్యం సమీక్షలు.. సమావేశాలు. అడుగు తీసి అడుగు వేస్తే విన్నపాలు, విజ్ఞప్తులు. రాజకీయ నాయకుల జీవితం చాలా గజి‘బిజీ’గా ఉంటుంది. మంత్రుల గురించైతే చెప్పనక్కర్లేదు. దసరా నాడు మంత్రి సీదిరి అప్పలరాజు తన బాల్యాన్ని వెతుక్కున్నారు. ఎక్కడ తన ప్రస్థానం మొదలైందో మళ్లీ అక్కడకే వెళ్లి రిఫ్రెష్‌ అయ్యారు. తన చిన్ననాటి మిత్రులతో కలసి సరదాగా చేపలు పట్టి వారిలో ఆనందం నింపారు. తండ్రి, సోదరులతో వేట చేయాలని ఉన్నా నాడు బాల్యమంతా చదువు, ఆ తర్వాత వైద్య వృత్తి వల్ల సాకారం కానప్పటికీ.. ఇప్పటికి ఆయన చుక్కాని పట్టుకుని సంద్రంలోకి దిగారు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని ఆయన స్వగ్రామం దేవునల్తాడలో దసరా రోజున సముద్ర తీరంలో కుటుంబ సభ్యులతో రోజంతా గడిపారు. తోటి మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టారు. సోదరుడు సీదిరి చిరంజీవి చేపల వేట సాగించే బోటుపై నడి సంద్రంలోకి వెళ్లారు. వల పట్టుకుని వృత్తిలో లీనమయ్యారు. 30 పనాల వరకు చేపలు చిక్కడంతో ఆయన ఆనందంతో ఎగిరి గంతేశారు. అనంతరం చేపలతో తీరానికి చేరుకున్న మంత్రి భావనపాడు తీరానికి సతీసమేతంగా వెళ్లి సముద్ర స్నానాలు చేశారు.   (రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం..)


సతీ సమేతంగా బోటింగ్‌ చేస్తున్న మంత్రి అప్పలరాజు
 
ఆ తర్వాత చిన్న నాటి స్నేహితులు తెరిపల్లి వరదరాజులు, సౌదాల వెంకన్న, సిరిగిడి వాసు, ఇతర కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడే భోజనాలు చేసి గంగమ్మ తల్లి చెంతన సేదతీరారు. దసరా రోజంతా ఇలా మంత్రిగారు ఆటవిడుపు అందరినీ ఆనందానికి గురి చేసింది. రోజంతా నిరాడంబరంగా పండగను జరుపుకోవడంతో తోటి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

ఇదో గొప్ప అనుభూతి... 
చాలా రోజులకు మళ్లీ చేపల వేటకు వెళ్లాను. ప్రధానంగా ఆటవిడుపు. కుటుంబం, స్నేహితుల మధ్య సరదాగా గడపడంతో బాల్యం గుర్తుకు వచ్చింది. ఇదో గొప్ప అనుభూతి. భావనపాడు ఫిషింగ్‌ హార్బర్‌లో ఎన్ని రకాల బోట్‌లు ఉన్నాయి. ఫీడ్‌ బ్యాక్‌ ఎలా ఉంది అనేది పరిశీలించాను. కొత్త రకమైన వలలు ఎన్ని వచ్చాయి. అ వలల పనితీరు ఎలా ఉంది. వారి అవసరాలేంటి? అనేదానిపై అక్కడ ఉన్న మత్స్యకారులతో మాట్లాడాను. మత్స్యకారులకు ఉన్న పథకాల వివరించా. బోటింగ్‌ చేశాక రింగ్‌ వల పట్టుకుని సహచరులతో కలిసి చేపల ఎర కనిపించిన వెంటనే వల వేశాం. మత్స్యకారులకు హార్బర్‌ అవసరం, ఇంజిన్లు సరఫరా చేయాల్సిన అవసరాన్ని నేరుగా పరిశీలించడం ఒక అవకాశంగా భావిస్తున్నాను. 
– డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top