వాయుగుండంగా మారిన అల్పపీడనం

Heavy rains forecast in south coastal and Rayalaseema - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 110, కరైకల్‌కు తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద చెన్నైకి సమీపంలో శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. శనివారం ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. భారీవర్షాలు పడే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు
మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో వడమాలపేటలో 132.75 మిల్లీమీటర్లు, పాకాలలో 110.75, తవణంపల్లెలో 108.25, చిత్తూరులో 106.50, రామచంద్రాపురంలో 104.25, చంద్రగిరిలో 96, శ్రీకాళహస్తిలో 94, కలకడ, రొంపిచర్లల్లో 93, యాదమర్రిలో 91.75, రేణిగుంటలో 90, చిట్వేల్‌లో 85, శ్రీరంగరాజపురంలో 82.75, కొత్తపల్లిలో 82, పలమనేరులో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top