
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు జిల్లాల్లో 15 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది.
నేడు, రేపు.. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అతిభారీ వర్షాలు.. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు.. బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.