రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి

Development of Gandi Kota with Rs 100 crores Andhra Pradesh - Sakshi

ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు వెల్లడి 

బి.కొత్తకోట: వైఎస్సార్‌ జిల్లా గండికోటను రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీటీడీసీ) ఎండీ కె.కన్నబాబు తెలిపారు. గండికోటకు స్పెషల్‌ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి  ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. గండికోటలో చేపట్టిన రోప్‌ వే పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. శ్రీకాళహస్తి, లంబసింగి, పెనుగొండ, గాలికొండ, అన్నవరంలో 20 కిలో మీటర్ల మేర రోప్‌ వేను రూ.1,200 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఒబెరాయ్‌ సంస్థ రూ.1,350 కోట్లతో గండికోట, తిరుపతి, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్, విశాఖపట్నంలో సెవెన్‌ స్టార్‌ హోటళ్లను నిర్మించనుందని చెప్పారు. వైజాగ్‌ బీచ్‌ కారిడార్‌ అమలుకు ప్రణాళికలు రూపొందించామని, భోగాపురం, భీమిలిలో పర్యాటకుల కోసం సీ ప్లేన్, తొట్లకొండలో రూ.120 కోట్లతో అక్వేరియం టన్నెల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు.

విజయవాడ భవానీ ద్వీపం అభివృద్ధికి రూ.149 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైందని తెలిపారు. ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ద్వీపం వరకు 2.5 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు ఈ మాస్టర్‌ ప్లాన్‌లో ఉందన్నారు. లంబసింగి, పాడేరులో కొత్తగా హోటళ్ల నిర్మాణం, అన్నవరంలో ఎకో రిసార్ట్‌కు చర్యలు చేపట్టామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top