కల్తీల కలవరం | Counterfeit Goods: A Danger to Public Safety in Andhra pradesh | Sakshi
Sakshi News home page

కల్తీల కలవరం

Jul 1 2025 2:09 AM | Updated on Jul 1 2025 4:26 AM

Counterfeit Goods: A Danger to Public Safety in Andhra pradesh

నీళ్ల నుంచి పాల వరకు అన్నీ కల్తీ

తాజాగా గుడ్‌నైట్, ఏరియల్‌ వస్తువులు నకిలీ 

గతంలో బ్రూ ప్యాకెట్లు,  టైడ్‌ పౌడర్లు ఫేక్‌గా తేలాయి 

ఒరిజనల్‌ ఏదో నకిలీ ఏదో కనిపెట్టలేక మోసపోతున్న జనం 

విజిలెన్స్‌ తనిఖీల్లో గుట్టు రట్టుతో వినియోగదారుల్లో ఆందోళన

అనంతపురంలోని పాతూరుకు చెందిన మహబూబ్‌ బాషా దోమలబారినుంచి తప్పించుకునేందుకు ఆలౌట్‌ లిక్విడ్‌ బాటిల్‌ కొన్నారు. దోమలు చావకపోగా ఎన్నాలున్నా లిక్విడ్‌ అయిపోలేదు. అప్పుడు తెలిసింది ఇది నకిలీ ఆలౌట్‌ అని.  

గుత్తిలో సుజాత అనే ఓ మహిళ అర డజను బట్టల సబ్బులు కొనింది. కానీ ఈ సబ్బుతో ఎంత ఉతికినా మురికి పోలేదు. చివరకు ఆరా తీస్తే అవి నకిలీవని తేలింది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మార్కెట్‌ నిండా నకిలీ, కల్తీ వస్తువులే. సామాన్యులు, నిరక్ష్యరాస్యులే కాదు బాగా చదువుకున్న ఐటీ ఉద్యోగులు కూడా నకిలీ వస్తువుల విషయంలో బోల్తా పడుతున్నారు. ఏది నకిలీనో, ఏది నిజమైనదో తేల్చుకోలేక వినియోగదారులు ఘోరంగా మోసపోతున్నారు. రోజువారీ వినియోగంలో ఉండే వస్తువుల వ్యాపారం రూ.కోట్లలో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నకిలీ, కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా విజిలెన్స్‌ తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తరచూ తనిఖీలు లేకపోవడం వల్ల ఇలా నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నట్టు ఆరోపణలున్నాయి.  

టీపొడిలో కొత్త కోణాలు 
ఇటీవలి కాలంలో కల్తీ టీపొడి వినియోగం తీవ్రమైంది. పదే పదే వాడిన టీని ఎండపెట్టి చింతపిక్కల పొడి వంటివి కలిపి మళ్లీ అమ్ముతున్నారు. ఇందులో కొన్ని ఆకర్షించే రంగులు, రుచికోసం రసాయనాలు కలుపుతున్నారు. ఒరిజనల్‌ టీపొడి అయితే ఒక గ్లాసు మంచినీళ్లలో వేస్తే... టీపొడి బాగా నానిన తర్వాత గానీ రంగుమారదు. అదే నకిలీ టీపొడి అయితే నీళ్లలో వేసిన రెప్పపాటులోనే నీళ్లన్నీ టీరంగులోకి మారిపోతాయి. లేబుళ్లు లేకుండా సంచుల కొద్దీ వస్తున్న ఈ టీపొడిలో మసాలాలు కలిపి వినియోగదారులకు అందిస్తున్న తీరు భయాందోళనకు గురి చేస్తోంది.  

పాలను విషపూరితం చేస్తున్నారు 
కల్తీపాలు ఇప్పటికీ యథేచ్ఛగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని రకాల నూనెలను బాగా మరగకాచి, వాటిలో కొన్ని క్రీములు కలిపి నకిలీ పాలను తయారు చేస్తారు. వీటిని డెయిరీ సంస్థలకు అమ్ముతున్నారు. డెయిరీ సంస్థలు ఫ్యాట్‌ కంటెంట్‌ (కొవ్వు శాతం) చూస్తాయి గానీ, ఇవి నకిలీవా, కాదా అనే పరిస్థితి లేదు.

కల్తీ మాఫియా గుప్పిట్లోనే.. 
కుళ్లిపోయిన వెన్నను కాచి నెయ్యిని తయారు చేస్తున్నారు. మంచి సువాసన కోసం కొన్నిరకాల రసాయనాలు కలుపుతున్నారు. 
కారంపొడిలో రకరకాల రసాయనాలతో పాటు కొన్ని రకాల పొట్టు కలిపి కారంపొడి తయారు చేస్తున్నారు. 
చిన్న పిల్లలకు ఇచ్చే గ్లూకోన్‌డీని కూడా కల్తీమయం చేశారు. కొన్ని రసాయనాల మిశ్రమం, శాక్రిన్‌లు కలిపి ఇస్తున్నారు. దీనివల్ల చిన్నారుల ఆహారం         గుల్లవుతోంది. 

పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. శనగపిండిలో బియ్యపు పిండి కలిపి అమ్ముతున్నారు. 
చిరు ధాన్యాల్లో అంటే ధనియాలు, మినప్పప్పు     వంటివి బాగా ఆకర్షించేలా ఉండటం కోసం ఓరకమైన నూనెలను కలుపుతున్నారు. ఇవి చాలా    ఆకర్షించేలా ఉంటాయి. 
తాజాగా సర్ఫ్‌ పౌడర్, సబ్బులు, గుడ్‌నైట్‌ లిక్విడ్‌ వంటి నకిలీ సరుకులు విజిలెన్స్‌ తనిఖీల్లో పట్టుకున్నారు.

నకిలీని కనిపెట్టేదెలా..?
సబ్బులు, బట్టలకు వాడే సర్ఫ్‌ వంటివి కనిపెట్టడం సామాన్య వినియోగదారులకు కొంచెం కష్టమే. కానీ కొద్దిగా పరిశీలిస్తే... 
ఒరిజనల్‌ కంపెనీ వస్తువుకు, నకిలీ వస్తువుకు లేబుల్‌ మీద ఉన్న రాత (ఫాంట్‌)లో తేడా ఉంటుంది. 

లోగోలో కూడా ఒక అక్షరం తేడాతో ఇమిటేట్‌ చేస్తుంటారు. 
అన్నింటికీ మించి బార్‌కోడ్‌ అతిముఖ్యమైనది. చిన్న చిన్న కిరాణా షాపుల్లో బార్‌కోడ్‌ స్కాన్‌ చేయరు. 
ఒకసారి బార్‌కోడ్‌ స్కాన్‌తో కొనుకున్న వస్తువును, కిరాణా షాపులో ఉన్న వస్తువును పోల్చి చూస్తే తేడా ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.  

డిక్లరేషన్‌ నిబంధనలే చూస్తాం 
మా పరిధిలో కంపెనీ డిక్లరేషన్‌లో ఇచ్చిన నిబంధనలు మాత్రమే చూస్తాం. అవి కరెక్టుగా ఉన్నాయా లేదా అనేదే పరిశీలిస్తాం. వస్తువు నాణ్యత చూడటం మా పరిధిలో లేదు. డిక్లరేషన్‌ నిబంధనలు అతిక్రమిస్తే సీజ్‌ చేస్తాం. – సుధాకర్, అసిస్టెంట్‌ కమిషనర్, తూనికలు కొలతల శాఖ

యాజమాన్యాలే జాగ్రత్తగా ఉండాలి 
నకిలీ ఏదో ఒరిజనల్‌ ఏదో సామాన్యులు కనిపెట్టలేరు. ఎన్నో ఏళ్లనుంచి వ్యాపారం చేస్తున్న కిరాణా షాపుల యజమానులకు డూప్లికేట్‌ ఏదో, మంచిదేదో తెలుసు. ఏజెన్సీలనుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించి తీసుకోవాలి. లేదంటే నకిలీ ప్రొడక్ట్‌లు దొరికితే నష్టపోయేది కిరాణాషాపుల యాజమాన్యాలే.  – జమాల్‌ బాషా, సీఐ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement