breaking news
Spurious
-
కల్తీల కలవరం
⇒ అనంతపురంలోని పాతూరుకు చెందిన మహబూబ్ బాషా దోమలబారినుంచి తప్పించుకునేందుకు ఆలౌట్ లిక్విడ్ బాటిల్ కొన్నారు. దోమలు చావకపోగా ఎన్నాలున్నా లిక్విడ్ అయిపోలేదు. అప్పుడు తెలిసింది ఇది నకిలీ ఆలౌట్ అని. ⇒ గుత్తిలో సుజాత అనే ఓ మహిళ అర డజను బట్టల సబ్బులు కొనింది. కానీ ఈ సబ్బుతో ఎంత ఉతికినా మురికి పోలేదు. చివరకు ఆరా తీస్తే అవి నకిలీవని తేలింది.సాక్షి ప్రతినిధి, అనంతపురం: మార్కెట్ నిండా నకిలీ, కల్తీ వస్తువులే. సామాన్యులు, నిరక్ష్యరాస్యులే కాదు బాగా చదువుకున్న ఐటీ ఉద్యోగులు కూడా నకిలీ వస్తువుల విషయంలో బోల్తా పడుతున్నారు. ఏది నకిలీనో, ఏది నిజమైనదో తేల్చుకోలేక వినియోగదారులు ఘోరంగా మోసపోతున్నారు. రోజువారీ వినియోగంలో ఉండే వస్తువుల వ్యాపారం రూ.కోట్లలో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నకిలీ, కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తరచూ తనిఖీలు లేకపోవడం వల్ల ఇలా నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నట్టు ఆరోపణలున్నాయి. టీపొడిలో కొత్త కోణాలు ఇటీవలి కాలంలో కల్తీ టీపొడి వినియోగం తీవ్రమైంది. పదే పదే వాడిన టీని ఎండపెట్టి చింతపిక్కల పొడి వంటివి కలిపి మళ్లీ అమ్ముతున్నారు. ఇందులో కొన్ని ఆకర్షించే రంగులు, రుచికోసం రసాయనాలు కలుపుతున్నారు. ఒరిజనల్ టీపొడి అయితే ఒక గ్లాసు మంచినీళ్లలో వేస్తే... టీపొడి బాగా నానిన తర్వాత గానీ రంగుమారదు. అదే నకిలీ టీపొడి అయితే నీళ్లలో వేసిన రెప్పపాటులోనే నీళ్లన్నీ టీరంగులోకి మారిపోతాయి. లేబుళ్లు లేకుండా సంచుల కొద్దీ వస్తున్న ఈ టీపొడిలో మసాలాలు కలిపి వినియోగదారులకు అందిస్తున్న తీరు భయాందోళనకు గురి చేస్తోంది. పాలను విషపూరితం చేస్తున్నారు కల్తీపాలు ఇప్పటికీ యథేచ్ఛగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని రకాల నూనెలను బాగా మరగకాచి, వాటిలో కొన్ని క్రీములు కలిపి నకిలీ పాలను తయారు చేస్తారు. వీటిని డెయిరీ సంస్థలకు అమ్ముతున్నారు. డెయిరీ సంస్థలు ఫ్యాట్ కంటెంట్ (కొవ్వు శాతం) చూస్తాయి గానీ, ఇవి నకిలీవా, కాదా అనే పరిస్థితి లేదు.కల్తీ మాఫియా గుప్పిట్లోనే.. ⇒ కుళ్లిపోయిన వెన్నను కాచి నెయ్యిని తయారు చేస్తున్నారు. మంచి సువాసన కోసం కొన్నిరకాల రసాయనాలు కలుపుతున్నారు. ⇒ కారంపొడిలో రకరకాల రసాయనాలతో పాటు కొన్ని రకాల పొట్టు కలిపి కారంపొడి తయారు చేస్తున్నారు. ⇒ చిన్న పిల్లలకు ఇచ్చే గ్లూకోన్డీని కూడా కల్తీమయం చేశారు. కొన్ని రసాయనాల మిశ్రమం, శాక్రిన్లు కలిపి ఇస్తున్నారు. దీనివల్ల చిన్నారుల ఆహారం గుల్లవుతోంది. ⇒ పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. శనగపిండిలో బియ్యపు పిండి కలిపి అమ్ముతున్నారు. ⇒ చిరు ధాన్యాల్లో అంటే ధనియాలు, మినప్పప్పు వంటివి బాగా ఆకర్షించేలా ఉండటం కోసం ఓరకమైన నూనెలను కలుపుతున్నారు. ఇవి చాలా ఆకర్షించేలా ఉంటాయి. ⇒ తాజాగా సర్ఫ్ పౌడర్, సబ్బులు, గుడ్‌నైట్ లిక్విడ్ వంటి నకిలీ సరుకులు విజిలెన్స్ తనిఖీల్లో పట్టుకున్నారు.నకిలీని కనిపెట్టేదెలా..?⇒ సబ్బులు, బట్టలకు వాడే సర్ఫ్ వంటివి కనిపెట్టడం సామాన్య వినియోగదారులకు కొంచెం కష్టమే. కానీ కొద్దిగా పరిశీలిస్తే... ⇒ ఒరిజనల్ కంపెనీ వస్తువుకు, నకిలీ వస్తువుకు లేబుల్ మీద ఉన్న రాత (ఫాంట్)లో తేడా ఉంటుంది. ⇒ లోగోలో కూడా ఒక అక్షరం తేడాతో ఇమిటేట్ చేస్తుంటారు. ⇒ అన్నింటికీ మించి బార్కోడ్ అతిముఖ్యమైనది. చిన్న చిన్న కిరాణా షాపుల్లో బార్కోడ్ స్కాన్ చేయరు. ⇒ ఒకసారి బార్కోడ్ స్కాన్‌తో కొనుకున్న వస్తువును, కిరాణా షాపులో ఉన్న వస్తువును పోల్చి చూస్తే తేడా ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిక్లరేషన్ నిబంధనలే చూస్తాం మా పరిధిలో కంపెనీ డిక్లరేషన్‌లో ఇచ్చిన నిబంధనలు మాత్రమే చూస్తాం. అవి కరెక్టుగా ఉన్నాయా లేదా అనేదే పరిశీలిస్తాం. వస్తువు నాణ్యత చూడటం మా పరిధిలో లేదు. డిక్లరేషన్ నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తాం. – సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్, తూనికలు కొలతల శాఖయాజమాన్యాలే జాగ్రత్తగా ఉండాలి నకిలీ ఏదో ఒరిజనల్ ఏదో సామాన్యులు కనిపెట్టలేరు. ఎన్నో ఏళ్లనుంచి వ్యాపారం చేస్తున్న కిరాణా షాపుల యజమానులకు డూప్లికేట్ ఏదో, మంచిదేదో తెలుసు. ఏజెన్సీలనుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించి తీసుకోవాలి. లేదంటే నకిలీ ప్రొడక్ట్‌లు దొరికితే నష్టపోయేది కిరాణాషాపుల యాజమాన్యాలే. – జమాల్ బాషా, సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ -
మాఫియా కోరల్లో ‘పశ్చిమ’
పచ్చని పంట పొలాలు.. ప్రేమానురాగాలు, అనుబంధాలను పంచే పల్లెలు.. కల్లాకపటం తెలియని ప్రజలు.. కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ప్రశాంత వాతావరణం.. ఇవీ మన జిల్లా పేరు చెబితే ఒకప్పుడు గుర్తుకొచ్చేవి. ఇప్పుడా సంస్కృతి జిల్లా నుంచి మాయమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. కొంతకాలంగా పచ్చని పశ్చిమలో చీకటి సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది. దొంగనోట్ల ముద్రణ, చలామణి, ఇసుక మాఫియా, మహిళల అక్రమ రవాణా, కల్తీ మద్యం, కలప స్మగ్లింగ్ సహా ఫ్యాక్షన్ ఛాయలు జిల్లాకు మచ్చ తెస్తున్నాయి. వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. సాక్షి, ఏలూరు : పచ్చని పశ్చిమ నేడు చీకటి సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాసతో కొందరు జిల్లా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ప్రశాంత జిల్లాగా పేరొందిన పశ్చిమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు అక్రమార్కులు ఇక్కడ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. కొందరు అధికారుల అండదండలతో అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. ఈ మాఫియాను అడ్డుకునేందుకు యంత్రాగం పూర్తిగా దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దొంగ నోట్ల ముద్రణకు కేరాఫ్ అడ్రస్ జిల్లా దొంగనోట్ల ముద్రణ, చెలామణికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నాలుగేళ్లుగా ఈ దందా కార్యకలపాలు మరింత జోరందుకున్నాయి. మూడేళ్ల క్రితం నిడదవోలులో దొంగనోట్ల ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసి నకిలీ కరెన్సీ ముద్రణకు రంగం సిద్ధం చేయగా పోలీసులు దాడి చేసి రూ.40 లక్షల విలువైన నకిలీనోట్లు గుర్తించారు. ఇటీవల కొవ్వూరు మండలం పంగిడిలో ఆరుగురు సభ్యుల దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. వారు స్థానికంగానే దొంగనోట్లు ముద్రించి చెలామణి చేస్తుండడం గమనార్హం. వారు చెప్పిన విషయాలు పోలీసులను సైతం షాక్‌కు గురిచేశాయి. నకిలీ కరెన్సీ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులను రాజమండ్రి కేంద్ర కారాగారానికి రిమాండ్ కోసం తరలిస్తుంటారు. వీరు జైల్లో ఉన్న మరికొందరు నేరస్తులను తమ నెట్‌వర్క్‌లో చేర్చుకుని వారు విడుదలయ్యాక వారి ద్వారా జిల్లా అంతటా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. అలా విస్తరించిన ఈ ముఠాల్లో ఇప్పుడు వందల మంది ఉన్నట్టు సమాచారం. మహిళల అక్రమ రవాణా జిల్లా నుంచి ఏడాదికి దాదాపు 400 మంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వీరిలో కొందరు బళ్లారి, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాల్లోని వ్యభిచార గృహాల్లో అమ్ముడుపోతున్నారు. మరికొందరు ఇతర దేశాలకు రవాణా అవుతున్నారు. మాట వినని వారు మత్యువాత పడుతున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని, ఉపాధి చూపిస్తామని,పెంచుకుంటామని,పెళ్లి చేసుకుని ఇలా ఏదో ఓ ఆశ చూపి అమాయక యువతులను వంచిస్తున్నారు. కలప స్మగ్లింగ్ జిల్లాలో అటవీ సంపదకు కొదవలేదు. కానీ అక్రమార్కుల చేతుల్లో అడవితల్లి నలిగిపోతోంది. ఏజెన్సీ ప్రాంతాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో టేకు, ఇరుగుడు చేవ (రోజ్ ఉడ్) కలపను విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. విస్తరిస్తున్న గ్యాస్, గుట్కా మాఫియా వంట గ్యాస్‌కు ఉన్న డిమాండ్ గ్యాస్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. గ్యాస్ ఫిల్లింగ్‌లో మోసాలకు పాల్పడటం, గ్యాస్ ఏజెన్సీలతో కుమ్మకై బ్లాక్మార్కెట్లో ఎక్కువ రేటుకి విక్రయించడం పరిపాటిగా మారింది. వంట గ్యాస్ సిలిండర్‌లో 14.5 కేజీలు ఉండాల్సి ఉండగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు సిలిండర్లను బ్లాక్‌లో కొని కేజీన్నర తగ్గించి విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాంతకమైన గుట్కాపై ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలో వాటిని విరివిగా విక్రయిస్తున్నారు. ఇటీవల భీమవరంలో గుట్కా ప్యాకెట్ల భారీ డంప్ బయటపడింది. ఏలూరు నగరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని గుట్కా తయారీ కూడా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూగ జీవాలనూ వదలడం లేదు దైవాంత సంభూతంగా భావించే తాబేళ్లతోనూ మాఫియా ముఠాలు వ్యాపారం చేస్తున్నాయి. పాలకొల్లు, నరసాపురం సముద్ర తీర ప్రాంతంలో స్థానికుల నుంచి తాబేళ్లను సేకరించి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక దందా రూటే సెపరేటు ఇటీవల కాలంగా ఇసుక దందా విపరీతంగా పెరిగిపోయింది. గోదావరి, తమ్మిలేరు, ఎర్రకాలువ నుంచి ఇసుక అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమార్కులు అధికారుల అండదండలతో ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం, సీతంపేట, వాడపల్లి, మద్దూరు లంక, పెదవేగి మండలం పినకడిమి, జానంపేట, విజయరాయి, బి.శింగవరం, రామచంద్రపురం, నడిపల్లి, దుగ్గిరాల, పోలవరం మండలంలో యడ్లగూడెం, నూతనగూడెం, కొత్తపట్టిసీమ, గూటాల, హక్కుంపేట ప్రాంతాల్లో ఇసుక మాఫియా విజృంభిస్తోంది.