
ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైం..
రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ జర్నలిస్టుల ఫిర్యాదు
ఎక్కడికక్కడ పోలీసులకు వినతిపత్రాలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలు సోమవారం కుట్ర పూరితంగా దాడులు చేయడాన్ని ఖండిస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల్లో సాక్షి జర్నలిస్టులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల ‘సాక్షి’ కార్యాలయాల గేట్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడటం దుర్మార్గం అని చెప్పారు.
‘సాక్షి’ నేమ్ బోర్డులను ధ్వంసం చేసి తగులబెట్టడం, కార్యాలయ గేట్లు, ప్రహరీ పైకి ఎక్కి సిబ్బందిపై దాడికి ప్రయత్నించడం సరైన చర్యలు కాదన్నారు. వారి చర్యల వల్ల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయోత్పాతానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై తక్షణ విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని, సాక్షి కార్యాలయ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ‘సాక్షి’ కార్యాలయాల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు.
ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైం అని, టీడీపీ నేతల దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై సెక్షన్ 143, 147, 427, 341, 506, 352 కింద కేసులు నమోదు చేయాలని కోరారు.