CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని.. 

CM YS Jagan Support For sick People at YSR District Visit - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్న అభాగ్యులు 

వెంటనే సాయం అందేలా చూడాలని ఆదేశం 

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శనివారం పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు ఆపన్నులకు అభయహస్తం అందించారు. నేనున్నానని, మీకేం కాదంటూ సత్వర చర్యలకు ఉపక్రమించారు. బాధితులను చూసి కాన్వాయ్‌ ఆపి, వాహనం దిగి నేరుగా వారి వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.

నరాల వ్యాధితో బాధ పడుతున్నానని అన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమి వీధికి చెందిన అనంతగిరి (23), తమ కుమారుడు జశ్వంత్‌కు మాటలు రావడం లేదని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోణ గ్రామానికి చెందిన దంపతులు రంగన్న, లక్ష్మి సీఎంకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమ కుమారుడు మహేంద్ర నడవలేక పోతున్నాడని పులివెందులలోనే ఉంటున్న కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన నాగరాజు, పుష్పావతి దంపతులు, తన భార్య అనారోగ్యంతో ఉన్నదని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట మల్లేష్, ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన తనను ఆదుకోవాలని రాయచోటి ప్రాంతానికి చెందిన షేక్‌ ఖదీర్‌లు సీఎంకు తమ బాధలు చెప్పుకున్నారు.

తన తొమ్మిది నెలల కొడుక్కు గుండెలో రంధ్రం ఉందని సింహాద్రిపురం మండలం బలపనూరుకు చెందిన అంకాలమ్మ.. తన కుమార్తె లావణ్య (13) తీవ్ర అనారోగ్యంతో ఉందని పులివెందుల 7వ వార్డుకు చెందిన ఆంజనేయులు సీఎంకు సమస్యలు వివరించారు. అందరి సమస్యలు ఓపికగా విన్న ముఖ్యమంత్రి.. అనారోగ్యంతో, ఇతర సమస్యలతో బాధ పడుతున్న వారందరికీ మెరుగైన వైద్యం అందించేలా, ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయరామరాజును ఆదేశించారు. సీఎం స్పందనపై బాధితులందరూ ఆనందం వ్యక్తం చేశారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top