AP: వైజాగ్‌కు రాజధాని ఎందుకు.? ఉత్తరాంధ్రపై మరోసారి అక్కసు వెల్లగక్కిన చంద్రబాబు

Chandrababu Naidu Incensed At The Remarks Visakha People - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించి.. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు కాంక్షిస్తుండగా.. చంద్రబాబు మాత్రం ఈ ప్రాంతం మీద తన అక్కసు మరోసారి వెళ్లగక్కారు.

భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో గురువారం నిర్వహించిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజల మనస్సు చివుక్కుమనేలా చేశాయి. ‘అమరావతిని రాజధానిని చేస్తాననీ.. వైజాగ్‌ని అభివృద్ధి చేస్తానంటూ’ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్‌ను ప్రపంచ పటంలో పెడతానంటూ మరోసారి అదే పాచిపోయిన పాత పల్లవిని అందుకున్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని మరోసారి తేటతెల్లం చేశాయని జనం వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అయితే.. విశాఖ అభివృద్ధి తథ్యమనీ, ఈ విషయం కూడా చంద్రబాబుకు తెలియకుండా సుదీర్ఘ అనుభవం అంటూ ఎలా బాకాలు కొట్టుకుంటున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

రాజధాని ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం కచ్చితంగా అభివృద్ధి చెందుతుందనీ.. ఉత్తరాంధ్ర మొత్తం విశాఖను రాజధానిగా చూడాలని ఎదురు చూస్తుంటే.. దాన్ని అడ్డు కునేందుకు టీడీపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలు ఇకపై సాగవంటున్నారు. వైజాగ్‌ యువతకు ఉపాధి కల్పించానంటూ ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న సమయంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. 

ఇంగ్లిష్‌ మీడియం చదివితే మొద్దుబారిపోతారంట? 
పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి చదువులు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టగా.. దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం విదితమే. అయితే పేదలకు నాణ్యమైన విద్య అందకూడదన్న చంద్రబాబు కుయుక్తులు మరోసారి బహిర్గతమయ్యాయి. సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘నాడు–నేడు అని జగన్‌ అంటున్నాడు.. మీ పిల్లలకు ఇంగ్లిష్‌ నేర్పుతా అన్నాడు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు తయారైంది రాష్ట్రం’ అని చేసిన వ్యాఖ్యలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో ఆయన మనవడు, కొడుకు ఇంగ్లిష్‌ మీడియంలో చదివారు కదా.. మొద్దబ్బాయిలు అయ్యారా అని గుసగుసలాడుకోవడం కనిపించింది. ఓవైపు పేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్‌ తరహా విద్య అందిస్తుంటే.. దాన్ని కూడా చెడగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటం సరికాదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఏనాడూ విద్యపై దృష్టి సారించలేదనీ.. ఇప్పుడు పాఠశాలల రూపు రేఖలు మారుతుంటే చూసి ఓర్వలేక.. ఇలా తప్పుడు స్టేట్‌మెంట్‌లు చేయడం హేయమని మండిపడుతున్నారు. బాదుడే.. బాదుడు అంటూ సభ నిర్వహించిన చంద్రబాబు ప్రతి మాటలోనూ, ప్రతి పదంలోనూ ఉత్తరాంధ్రపై విషం కక్కడంపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతోంది. విశాఖకు రాజధాని రాకుండా టీడీపీ ఏ విధంగా కుట్రపన్నుతుందో స్పష్టమైందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నిరసన సెగ 
నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఉదయం కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఉత్తరాంధ్ర బీసీ సంఘాల నేతలు, పలు మహిళా సంఘాల నాయకులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధానిగా అభివృద్ధి చెందకుండా విశాఖపై చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. రాజధానిగా విశాఖకు చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అంటూ ఉత్తరాంధ్ర మహిళా ప్రతినిధులు నినాదాలు చేశారు.

బయట జరుగుతున్న ఆందోళన గురించి తెలుసుకున్న చంద్రబాబు.. గొడవ జరుగుతున్నంత సేపూ రాజధాని అంశంపై కిమ్మనకుండా ప్రసంగించడం గమనార్హం. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. అదే వ్యవహారశైలితో చంద్రబాబు విశాఖపై విషం వెళ్లగక్కుతుంటే.. కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు ఆ కల నెరవేరకుండా అడ్డుకుంటున్నారంటూ అధినేత వ్యాఖ్యలపై అసహనం చెందడం కొసమెరుపు.  

(చదవండి: ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top