రైతు కథ.. కన్నీటి వ్యధ.. కర్షకుల కష్టం దళారుల పాలు | Chandrababu Naidu govt: Farmers Worry lacking of Support price for crops | Sakshi
Sakshi News home page

రైతు కథ.. కన్నీటి వ్యధ.. కర్షకుల కష్టం దళారుల పాలు

Apr 26 2026 5:11 AM | Updated on Apr 26 2026 5:45 AM

Chandrababu Naidu govt: Farmers Worry lacking of Support price for crops

గుంటూరు జిల్లా చిన్న పరిమి గ్రామంలో రోడ్డు పక్కన పోసి ఉన్న మొక్కజొన్న

జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి, టమాటా తదితర పంటలకు మద్దతు ధర కరువు

ఆదుకోవాల్సింది పోయి చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు 

దళారులకు మేలు చేసే నిర్ణయాలతో కుదేలవుతున్న రైతులు

కూరగాయల రైతుల పరిస్థితి అగమ్యగోచరం  

పెట్టుబడి ఖర్చులు కూడా రాక గగ్గోలు పెడుతున్న అన్నదాతలు 

ఏ పల్లెకు వెళ్లినా కనీసం పెట్టుబడి రావడం లేదని రైతన్నల ఆక్రందన 

ఏ పంటనూ కొనుగోలు చేయలేమన్న ప్రభుత్వ తీరుపై మండిపాటు 

రెండేళ్లుగా దళారుల దోపిడీకి గురవుతున్నామంటూ ఆవేదన 

ఇంత దయనీయ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని ఆగ్రహం 

గత ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని గుర్తు చేసుకుంటున్న రైతులు

ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర లేనే లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారే కనిపించడం లేదు. తొలి పంట వైపరీత్యాలతో దెబ్బతింటే.. రెండో పంటకు మద్దతు ధర దక్కక, కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించడంలో బాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అప్పులతో సాగు చేసి పండించిన పంటను అయినకాడకి తెగనమ్ముకుంటూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా రాసులు పోసిన పంటలు దర్శనమిస్తున్నాయి. కొనేవారు లేక, మద్దతు ధర దక్కక, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని సుమారు 30కి పైగా పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్నదాతల వెతలు వర్ణనాతీతం. ఏ పల్లెకు వెళ్లినా రైతుల ఆక్రందనలే.. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. కళ్లెదుట పంటకు మద్దతు ధర దక్కక పోవడంతో చమర్చిన కళ్లతో దుఃఖాన్ని పంటి కింద అదిమి పెట్టుకొని రైతన్నలు మౌనంగా రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది. 

పెట్టుబడులు పెరిగిపోయాయి 

రెండెకరాల్లో కౌలుకు చేస్తున్నా. ఎకరాకు రూ.20 వేలు కౌలుకు చెల్లించాను. రబీలో మొక్క జొన్న సాగుకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతకు రూ.4 వేలు తీసుకుంటున్నారు. పంటను తోలేందుకు ట్రాక్టర్‌కు రూ.1,000 డిమాండ్‌ చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరిగిపోతున్నాయి. ధర మాత్రం పెరగడం లేదు. మార్కెట్‌లో చూస్తే రూ.1,650కి మించి కొనడం లేదు. ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోతున్నా.     
– తాళ్లూరి ఇసాక్, గణపవరం, పల్నాడు జిల్లా  
 

ఈ రైతు పేరు లగడపాటి వీరాంజనేయులు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఈయన రబీలో కౌలుకు తీసుకున్న 30 ఎకరాల్లో శనగ, 10 ఎకరాల్లో తెల్లజొన్న వేశాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.6 లక్షలు కౌలుకే చెల్లించాడు. రెండు పంటలకు రూ.15 లక్షల వరకు రూ.2కు వడ్డీకి తెచ్చి సాగు చేశాడు. తెల్లజొన్న 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, శనగ 8 క్వింటాళ్లకు మించి రాలేదు. తెల్లజొన్న రూ.1,600కు అమ్ముకున్నాడు. శనగకు క్వింటాకు రూ.4,900కు మించి ధర లేదు. ‘అతి కష్టమ్మీద 40 క్వింటాళ్ల శనగను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా రెండు నెలలైనా పైసా జమ కాలేదు. గతేడాది నల్లబర్లి పొగాకు సాగుతో రూ.10 లక్షలు నష్టపోతే ఈసారి మరో రూ.15 లక్షలకు పైగా నష్టపోతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.


ఈ రైతు పేరు శివ వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా చుండూరు మండలం చిన్న పరిమి గ్రామానికి చెందిన ఈయన 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.32 వేలు కౌలు చెల్లించాడు. అదునుకు యూరియా దొరకక బ్లాకులో బస్తా రూ.350–450 మధ్య కొనుగోలు చేశాడు. పంటను కాపాడుకునేందుకు మోటార్లతో ఐదుసార్లు నీళ్లు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఎకరాకు రూ.50 వేల చొప్పున అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికొచ్చేసరికి క్వింటా రూ.1,600కు మించి కొనడం లేదని, ఈ ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. వైఎస్‌ జగన్‌ హయాంలో ఇదే మొక్కజొన్నను రూ.2,650కు అమ్ముకున్నానని, పచ్చి వడ్లకు రూ.2,200 ధర దక్కిందని చెప్పాడు. జగన్‌ ప్రభుత్వంలో మంచి ధరలు లభించాయని, ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.


ఈ రైతు పేరు వేటు వెంకటేశ్వరరెడ్డి. బాపట్ల జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకొని తొలి పంట వరి వేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే అకాల వర్షాలకు 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. దాంట్లో సగం కౌలుకే ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన ధాన్యం బస్తా (75 కేజీలు) రూ.1,350 చొప్పున అమ్ముకున్నాడు. రబీలో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడితో జొన్న సాగు చేశాడు. మోంథా తుపానుకు మూడొంతులు పంట పోతే రెండోసారి విత్తగా ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. తీరా మార్కెట్‌కు తెస్తే కొనేవారు లేరు.  ‘రెండు పంటలకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.5 లక్షలే చేతికొచ్చింది. ఈ సీజన్‌లో రూ.7 లక్షలకు పైగా నష్టపోయాను’ అని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ రైతు పేరు నల్లమోతు సత్యనారాయణ. పల్నాడు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.5 ఎకరాల్లో మొక్కజొన్న, 1.60 ఎకరాల్లో బొప్పాయి పంటలు సాగు చేశాడు. ఎకరాకు మొక్కజొన్నకు రూ.50 వేలు, బొప్పాయికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. మొక్కజొన్న ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటా రూ.1,600కు అమ్ముకోగా, బొప్పాయి పంటకు నాందేడ్‌ తెగులు సోకడంతో నాణ్యత తగ్గింది. ‘ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు రావడం లేదు. మార్కెట్‌లో కిలో రూ.10కి మించి కొనేవారు లేరు. తెగులు సోకిందంటే కిలో రూ.5కే అడుగుతున్నారు. కనీసం కిలోకు రూ.15–16 ధర వస్తే కానీ గిట్టుబాటు కాదు. గతేడాది 10 ఎకరాల్లో వంగ తోట వేసి నష్టపోయాను. ఈసారి మొక్కజొన్న, బొప్పాయి వేసి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాను. ఏం చేయాలో పాలుపోవడం లేద’ని కన్నీటి పర్యంతమయ్యాడు. 


పల్నాడు జిల్లా నాదెళ్లలో తెగుళ్ల బారిన పడిన బొప్పాయి పంట 

(పంపాన వర ప్రసాదరావు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి చందాన తయారైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులు గతేడాది సాగు చేసిన నల్ల బర్లీ పొగాకుతో తీవ్ర నష్టాలను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ వందలాది మంది రైతుల ఇళ్లల్లో పొగాకు బేళ్లు బేలచూపులు చూస్తూనే ఉన్నాయి. మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు రూ.5–10 లక్షల వరకు నష్టపోయారు. నల్లబర్లి పొగాకు సాగు చేయొద్దు.. లాభసాటిగా ఉన్న మొక్కజొన్న, శనగ సాగు చేయండని ప్రభుత్వం ఊరూ వాడ ప్రచారం చేసింది. మరొక వైపు గతేడాది నష్టపోయిన మిర్చి, పత్తి రైతులు సైతం ఈసారి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది సాగు వైపు మళ్లారు. బాపట్ల లంక గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాలో సాగు చేసే టమాటా, ఉల్లి, బెండ, వంగ, గోరుచిక్కుడు, దోసకాయలు, బంగాళదుంప తదితర కూరగాయల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పనంగా ఇవ్వలేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. 

పల్నాడు జిల్లా అమీన్‌సాహెబ్‌ పాలెంలో మిర్చిని ఆరబోస్తున్న రైతులు 

తీపిని పంచాల్సిన పుచ్చకాయ, కర్బూజ తోటలు రైతులకు కన్నీటి చేదును మిగిలిస్తున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని.. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదని రైతులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకృతి ప్రకోపం వల్లనో, మార్కెట్‌ వైఫల్యం వల్లనో నష్టపోవడం లేదని.. ముమ్మాటికీ పాలకులు చేస్తున్న నమ్మక ద్రోహం వల్లే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా వంటి పంటలకైతే కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలాల్లోనే వదిలేస్తున్నామని తెనాలికి చెందిన ఎం.భాస్కరరావు అనే కౌలు రైతు వాపోయారు. అరటి, బొప్పాయి పంటలు కొనే వారు లేక తోటల్లోనే పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మొంథా తుపాను వల్ల నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదని అయ్యారుపేటకు చెందిన పొపూరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్మగా వచ్చిన అరకొర ఆదాయం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మరో కౌలు రైతు కుసుమర్తి ముసలయ్య కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి జలగల్లా పీలుస్తుంటే ప్రభుత్వం కళ్లున్నా చూడలేని కబోదిలా తయారైందని మండిపడుతున్నారు.
 
మార్కెట్‌ యార్డులు వెలవెల
ఎప్పుడూ కళకళలాడే మార్కెట్‌ యార్డులు కొనుగోళ్లు లేక నిశ్శబ్దానికి వేదికలవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న సాగు చేస్తే కొనేవారు లేక చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక హమాలీలుగా పని చేయాల్సి వస్తోందని ఐతానగర్‌కు చెందిన శనవం గోపిరెడ్డి వాపోయారు. పేరుకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగా మూసేశారని, క్వింటాకు రూ.4,800కే దళారులకు తెగనమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. మరొక వైపు మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర రూ.2,400 కాగా, మార్కెట్‌లో రూ.1,400 నుంచి రూ.1,650 మధ్య పలుకుతోంది. అది కూడా వ్యాపారుల కాళ్లా వేళ్లా పడితే కానీ కొనడం లేదంటున్నారు. జొన్న రైతుల పరిస్థితీ అంతే.. మద్దతు ధర క్వింటా రూ.3,749 కాగా, మార్కెట్‌లో రూ.1,600–1,850 మధ్య దక్కుతోంది. దాచుకునేందుకు డబ్బుల్లేక సన్న, చిన్నకారు రైతులు ఈ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారైతే గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు.


ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఏనాడూ మద్దతు ధర కోసం ఇబ్బంది పడలేదని రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఏదైనా సందర్భంగా మార్కెట్‌లో కాస్త ధర తగ్గితే చాలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునేదని గుర్తు చేస్తున్నారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని వాపోతున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. 

⇒ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్క జొన్న కొనుగోళ్లకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తోంది. పైగా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వకపోతే మొక్కజొన్నే కాదు ఏ పంటనూ కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఊడినా ఒకటేనని మండిపడుతున్నారు. 

⇒ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు మేరకు రైతులకు లాభసాటి ధరలు దక్కేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించేలా చేయడంలో విఫలమవుతోంది. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకం, పంట నష్టపరిహారం వంటి పథకాలు అందక పోవడం వంటి కారణాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రెండేళ్లలో రూ.25 వేల కోట్ల సంపదను రైతులు నష్టపోయారు.

గతంలో బస్తా రూ.2 వేలు పలికేది 
ఐదెకరాల్లో గోరు చిక్కుడు సాగు చేశా. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 60 బస్తాలు (బస్తాకు 10 కేజీలు) దిగుబడులొచ్చాయి. మార్కెట్‌కు పోతే 10 కేజీల బస్తా రూ.240కు మించి కొనడం లేదు. గతంలో రూ.2 వేల వరకు ధర పలికేది. ఈసారి తీవ్రంగా 
నష్టపోతున్నా.    
– ఎరుపల్లి శ్రీనివాసరావు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లా

బాండ్‌ ఇచ్చినా..ఇబ్బందులే..
ఐదెకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేశాను. ఐటీసీ బాండ్‌ కూడా ఇచ్చింది. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికొచ్చేసరికి గోదాములు ఖాళీగా లేవంటూ రేపురా మాపురా అంటూ తిప్పుతున్నారు. కొనే సమయానికి నాణ్యత లేదంటున్నారు. ధర తగ్గించేస్తున్నారు. గతేడాది నల్లబర్లి సాగు చేసి నష్టపోయాం. ఈసారి వర్జీనియా సాగు చేసి ఇబ్బంది పడుతున్నాం.    
    – మందుల నాగరాజు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లా

అప్పులోళ్లకు జమ చేశారు 
ఎకరం సొంత పొలం ఉంది. మరో ఎకరన్నర కౌలుకు తీసుకుని తెల్లజొన్న పంట వేశాను. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.75 వేల వరకు రూ.2 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 40 టిక్కీలు (టిక్కీ 60 కేజీలు) చొప్పున 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కనీస మద్దతు ధర రూ.3,749 మాట దేవుడెరుగు.. కనీసం మార్కెట్‌లో కొనేవారు లేరు. అప్పులోళ్లు వడ్డీల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. చేసేది లేక క్వింటా రూ.1,850కు ఓ వ్యాపారికి తెగనమ్ముకున్నా. చేతికి రూ.44 వేలు రావడంతో దాన్ని అప్పులోళ్లకు జమ చేశాను. ఇంకా కౌలుకు చెల్లించాల్సి ఉంది. ఇంటికి పైసా కూడా తీసుకెళ్లలేదు.
    – పాటిపండ్ల వీరయ్య, ఐతానగరం, బాపట్ల జిల్లా

రెండు పంటల్లోనూ నష్టాలే..
ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్‌ (25 కేజీలు)  రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్‌లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది.     
    – కళ్లం అనిల్‌కుమార్‌ రెడ్డి, సాహెబ్‌పాలెం, పల్నాడు జిల్లా

గోరుచిక్కుడుకూ ధర లేదు..
కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు.      
    – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లా

రెండు పంటల్లోనూ నష్టాలే..
ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్‌ (25 కేజీలు)  రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్‌లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది.     
    – కళ్లం అనిల్‌కుమార్‌ రెడ్డి, సాహెబ్‌పాలెం, పల్నాడు జిల్లా

గోరుచిక్కుడుకూ ధర లేదు..
కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు.      
    – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లా

ఆ ఐదేళ్లూ... అన్నదాతకు భరోసా
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ధర లేని ప్రతీసారీ మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. వాటి ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి ఇవ్వకపోయినా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. చివరకు ఎన్నికల వేళ రబీ 2023–24 సీజన్‌లో ఓ దశలో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే కేంద్రం నుంచి అనుమతులు రాకున్నా మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి తమది రైతు ప్రభుత్వమని వైఎస్‌ జగన్‌ నిరూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement