
తాజాగా మరో రూ.2 వేల కోట్లు
సుపరిపాలనలో కాదు... అప్పుల పాలనలో తొలి అడుగు
చంద్రబాబు రుణ ప్రగతి ఇప్పటికి రూ.1.70 లక్షల కోట్లు
ఏడాదిలోనే ఇంత భారీఎత్తున అప్పు చేయడంలో రికార్డు
సంవత్సరంలోనే బడ్జెట్ రుణాలు రూ.1,20,102 కోట్లు
బడ్జెట్ బయట చేసినవి మరో రూ.50,410 కోట్లు
మొత్తం కలిపి రూ.1,70,512 కోట్లు
ఇంత చేసినా సూపర్ సిక్స్ అమలు లేదు, మూల ధన వ్యయం లేదు
అప్పు చేయకుండా సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు
నేడు కేవలం రుణాలు తేవడమే లక్ష్యంగా పరిపాలన
తొలి అడుగు’’ అంటూ ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి పెద్దలు సంబరాలు నిర్వహించారు. కానీ, దీనికి విరుద్ధంగా ‘అప్పుల పాలనలో తొలి అడుగు’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు సర్కారు తీరు. మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ... 6.80 శాతం నుంచి 7 శాతం వడ్డీకి ఈ మొత్తం రుణం సమీకరించింది.
ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,20,102 కోట్లకు చేరాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే ఏ ప్రభుత్వమూ చేయనన్ని అప్పులు తెచ్చి చరిత్రలోకి ఎక్కింది. రికార్డులు సృష్టించింది. తాజా రుణంతో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పులు రూ.1,70,512 కోట్లకు చేరాయి. -సాక్షి, అమరావతి
» బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.19,410 కోట్లు తెచ్చారు. మరోపక్క రాజధాని అమరావతి పేరిట ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజ«దాని అప్పులకు చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
» ఇంత పెద్దఎత్తున అప్పు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై భారం మోపారు తప్ప... ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు, ఇతర హామీలను మాత్రం అమలు చేయలేదు. ఆస్తుల కల్పనకు గాని సంక్షేమానికి గాని పైసా వ్యయం చేయలేదు.
» సంపద సృష్టించడం దేవుడెరుగు...! అదనంగా ప్రజలపై అప్పులు మోపుతున్నారు. ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసిందీ అంటే భారీగా అప్పులు తప్ప ఏమీ లేవని స్పష్టమవుతోంది.
» ఏపీఎండీసీకి చెందిన 436 గనుల లీజు విలువను రూ.1.91 లక్షల కోట్లుగా చూపించి ప్రైవేట్ బాండ్లు జారీ ద్వారా రూ.9 వేల కోట్లు అప్పు చేసింది. ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తులకు ఖజానాను తాకట్టు పెట్టి రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడింది.
» గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టారు. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం సాగించారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా ప్రజలకు ఎల్లో మీడియా వాస్తవాలను తెలియజేయడం లేదు.