AP New Cabinet Minister Kakani Govardhan Reddy Biography - Sakshi
Sakshi News home page

Kakani Govardhan Reddy: చరిత్రను తిరగరాసిన నేత కాకాణి

Apr 10 2022 7:15 PM | Updated on Apr 11 2022 8:17 AM

AP New Cabinet Minister Kakani Govardhan Reddy Profile - Sakshi

రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో అదృష్టం కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వరించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన రథసారథిగా జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడిపించారు. మధ్యలో కొంత కాలం మినహా జిల్లా అధ్యక్షుడిగా, నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా రెండు దఫాలు వైఎస్సార్‌సీపీని విజయతీరానికి చేర్చారు. తల్లిదండ్రుల వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేసిన కాకాణి ఆది నుంచి ఓటమి ఎరుగని నేతగా ఎదిగారు. తన రాజకీయ చతురతతో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో దిట్టగా నిలిచారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి చోటు దక్కింది. జిల్లాలో ఆశావహులున్నప్పటికీ అధిష్టానం ఎమ్మెల్యే కాకాణి వైపు మొగ్గు చూపింది. ఆది నుంచి పార్టీకి విదేయుడిగా, జిల్లాపై సమగ్ర అవగాహన, రాజకీయ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే ధీశాలిగా  ఆయనకు కలిసొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.    

వైఎస్సార్‌పీపీ అధికారంలో రాగానే జిల్లా నుంచి దివగంత మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. మొదటి విడతలో నెల్లూరు జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పోర్టు ఫోలియోలు అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్‌ జిల్లా తర్వాత ఆ స్థాయిలో మద్దతుగా నిలిచిన జిల్లా అంటే ప్రాణంగా భావిస్తున్నారు. రెండో విడతలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని ముందే ప్రకటించారు. ఆ మేరకు జిల్లా నుంచి ఈ విడతలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణికి అవకాశం దక్కింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, అసెంబ్లీ ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌గా అపార అనుభవం ఉన్న గోవర్ధన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.  

విధేయత, చతురత  
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి పార్టీ పట్ల విధేయుత, రాజకీయ చతురతే మంత్రివర్గంలో స్థానం దక్కిందని చెబుతున్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత నుంచి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి ఉండి నడిచారు. 2011లో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి జిల్లా బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ రెండో దఫా 2015 నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీ నుంచి ఎటువంటి పిలుపు వచ్చినా వెంటనే స్పందిస్తూ అందుకు తగ్గట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రతిపక్షంలో అధికార టీడీపీపై దూకుడు తనం ప్రదర్శించేవారు. ఎప్పు డూ తనదైన శైలిలో వ్యంగోక్తులు విసురుతూ రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం  
జిల్లాలో 2006లో కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీగా సైదాపురం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికతో కాకాణి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన తండ్రి, దివంగత మాజీ సమితి ప్రెసిడెంట్‌ కాకాణి రమణారెడ్డి రాజకీయ వారసుడుగా తెరపైకి వచ్చిన గోవర్ధన్‌రెడ్డి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో జెడ్పీ చైర్మన్‌ గా ఐదేళ్లు జిల్లాలో తన ప్రత్యేకత చాటుకున్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే జెడ్పీ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేక మెటీరియ ల్స్‌ తయారు చేసి విద్యను ప్రోత్సహించారు. తర్వాత వైఎస్సార్‌ కుటుంబం, వైఎస్సార్‌సీపీ వెంట నడిచి 2014, 2019లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీని రెండు సార్లు విజయతీరానికి చేర్చారు. 2014లో అప్పటి ఉమ్మడి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలు, 2019లో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.  

చరిత్ర తిరగరాసిన నేత  
ఈ జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్‌ ఉండదనే నానుడి ఉంది. ఈ నానుడి చరిత్రను కాకాణి గోవర్ధన్‌రెడ్డి తిరగరాశారనే చెప్పాలి. జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన ఆయన 2014, 2019లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.    

చదవండి: (Ushashri Charan: కంచుకోటను బద్దలు కొట్టి.. మంత్రి వర్గంలో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement