సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం వేకువఝామున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన.
అంబటి దీక్షకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్‌లోని అంబటి నివాసం, కార్యాలయాన్ని ముట్టడించాయి. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినా కూడా గుంపుగా వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసంతో వీరంగం సృష్టించాయి. ఆపై నాటకీయ పరిణామాల నడుమ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు(జనవరి 31న).

అంబటి రాంబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. ఆయన్ని బయటకు రానివ్వకుండా పలు కేసులను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. చివరకు న్యాయ వ్యవస్థ జోక్యంతో ఆయన రెండు వారాల తర్వాత(ఫిబ్రవరి 18న) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.


