మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం
చింతపల్లి: సీలేరు విద్యుత్ కేంద్రంలో అవుట్‌సోర్సింగ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ, విద్యుత్ షాక్‌తో మృతి చెందిన గంగిరి గణేష్ కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. గురువారం చింతపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గంగిరి గణేష్ గత ఆరేళ్లుగా సీలేరు విద్యుత్ ప్రాజెక్టులో అవుట్‌సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడన్నారు. అతని సంపాదనపైనే తల్లి, సోదరుడు ఆధారపడి జీవిస్తున్నారని, అతని మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ శాఖ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఇందులో భాగంగా శుక్రవారం గణేష్ మృతదేహంతో విద్యుత్ ప్రాజెక్టు వద్ద కుటుంబ సభ్యులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందితో కలిసి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు శివకుమార్, శ్రీను, కూడా సురేష్ పాల్గొన్నారు.
బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్


