వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
● పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారిజయరాజ్
చింతపల్లి: గిరిజన రైతులు పెంచుతున్న కోళ్లు, గొర్రెలు, మేకలకు సోకే వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జయరాజ్ సూచించారు. గురువారం ఆయన లోతుగెడ్డ, లంబసింగి పశు ఆసుపత్రులను తనిఖీ చేయడంతో పాటు, భీమసింగిలోని ఫామ్‌లను పరిశీలించారు. పొరుగు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో, గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోళ్లలో అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 55 వేల గొర్రెలు, మేకలకు ’షీప్ పాక్స్’ టీకాలు వేయడమే కాకుండా మూడు లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదవశాత్తు పశునష్టం వాటిల్లితే ఆర్థిక భరోసా కోసం రైతులు ’బీమా’ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు సౌజన్యదేవి, శాలిని, ఉపేంద్ర పాల్గొన్నారు.


