అసత్య ప్రచారాల్లో దిట్ట చంద్రబాబు
అనకాపల్లి : సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా, తిరుమల లడ్డూ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఘోరమైన విషపూరిత ప్రచారాలు సీఎం చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి పాలన సాగుతుందని, త్వరలో వేంకటేశ్వరస్వామి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక సీఎం చంద్రబాబు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికై నా లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారాలు మానుకుని రాష్ట్రంలో వితంతువులు, దివ్యాంగులు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రభుత్వ పింఛను ఇచ్చే విధంగా దృష్టి సాధించాలని హితవు పలికారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, 18 సంవత్సరాలు పైబడి మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఎప్పడిస్తారో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంతో వినియోగించే నెయ్యిలో జంతువు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ పదే పదే విషపూరిత ప్రచారం చేయడం దారుణమన్నారు. మొన్నటి వరకూ లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని, ఇప్పుడు బాత్‌రూమ్‌లు కడిగే హర్పిక్స్ తయారీకి వినియోగించే కెమికల్స్ కలిపారని మరో దుష్ప్రచారానికి తెర తీయడం సిగ్గు చేటన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లడ్డు విషయంలో తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయకుండా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ డబ్బా కొట్టుకోవడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కరోన వంటి విపత్తుల్లో రాష్ట్రానికి ఆదాయం లేకపోయినప్పటికీ వైఎస్సార్‌సీపీ పానలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేశారని, ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అదాయం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోందన్నారు.


