రైల్వే గేట్(వరంగల్): భారత్ దర్శన్‌లో భాగంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు వరంగల్ రైల్వే స్టేషన్‌కు ఈనెల 30న అర్ధరాత్రి 2 గంటలకు(31 తెల్లవారు జామున) రానున్నట్లు ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 12 కోచ్‌లు, ఏసీ 3 టైర్ బోగీలతో 2,440 బెర్త్‌లతో కూడిన రైలు వరంగల్ వస్తున్నట్లు చెప్పారు. ఎనిమిది రోజులు, ఏడు రాత్రులతో కూడిన ఈ ప్రయాణంలో ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ గుడి, భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్, ఆంధ్రలో విశాఖపట్నం బుర్రా కేవ్స్, అరకు వ్యాలీ, సింహాచలం, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చని వివరించారు. ఒకరికి రూ.7895(స్టాండర్డ్ స్లీపర్), రూ.9575(కంఫర్ట్ ఏసీ 3 టైర్) కింద చెల్లించాల్సి ఉంటుందని, ఆన్‌లైన్, రైల్వే బుకింగ్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు ఐఆర్‌సీటీసీ జోనల్ ఆఫీస్ 040–27702407, 9701360701, 9701360690లలో సంప్రదించాలని సంజీవయ్య కోరారు. ఈ ప్రయాణికులకు అల్పాహారం, భోజనం, వసతి, ఉచితంగా ఆలయ దర్శనాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.