‘‘ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే సీమాంధ్ర ప్రాంతం శ్మశానంగా మారుతుంది. అక్కడేం మిగలదు. వాటిని పరిపాలించేందుకు మేము సిద్ధంగా లేము.
రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర శ్మశానమే: శైలజానాథ్
Sep 9 2013 3:50 AM | Updated on Sep 27 2018 5:56 PM
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే సీమాంధ్ర ప్రాంతం శ్మశానంగా మారుతుంది. అక్కడేం మిగలదు. వాటిని పరిపాలించేందుకు మేము సిద్ధంగా లేము. అలాంటప్పుడు పదవులను పట్టుకొని వేలాడబోం. రాష్ట్రాన్ని కాపాడేందుకు ఉద్యోగులు, ప్రజలే స్వతహాగా ఉద్యమాలు చేస్తున్నారు. వారినెవ్వరూ ఆపలేరు. రాజకీయ నాయకులుగా మేమొక అజెండాతో పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని విడదీయకుండా ఉంచేందుకు మా వంతు కృషి చేస్తున్నాం’’అని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. ఢిల్లీ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలుగు ఉద్యోగులు ఆదివారం ఏపీభవన్ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మంత్రి శైలజానాథ్ విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నాక పార్టీ ఎమ్మెల్యేలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడం ఇదే ప్రథమం అన్నారు. రాజకీయ నాయకులుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అది చేయలేమనుకున్నప్పుడు తమ పార్టీ సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల్లో ఉండబోరన్నారు. సాయంత్రం 4 గంటలకు ఉద్యోగుల దీక్షను మంత్రి శైలజానాథ్ విరమింపచేశారు.
Advertisement
Advertisement