వ్యూహం మార్చిన ఓపీఎస్‌.. చలో రిసార్ట్‌! | panneerselvam new strategy | Sakshi
Sakshi News home page

వ్యూహం మార్చిన ఓపీఎస్‌.. చలో రిసార్ట్‌!

Published Sun, Feb 12 2017 2:41 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

వ్యూహం మార్చిన ఓపీఎస్‌.. చలో రిసార్ట్‌!

చెన్నై: తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వీకే శశికళ, పన్నీర్‌ సెల్వం మధ్య క్షణక్షణానికి బలాబాలాలు మారిపోతున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. సాయంత్రం వరకు ఎదురుచూసి.. అప్పటికి కూడా గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే.. ఇక ఢిల్లీ బాట పట్టాలని చిన్నమ్మ శశికళ భావిస్తుండగా.. ఆమెకు మరో షాక్‌ ఇచ్చేందుకు పన్నీర్‌ సెల్వం సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే శశికళ నేతలను తనవైపు తిప్పుకోవడంలో బాగానే విజయవంతమవుతున్న సెల్వం తన రాజకీయ చదరంగానికి రిసార్ట్‌ను వేదికగా చేసుకోబోతున్నారు. గోల్డెన్‌ బే రిసార్ట్‌లో బస చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కలువాలని ఓపీఎస్‌ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన మరికాసేపట్లో రిసార్ట్‌కు రానున్నారని సమాచారం. ఎమ్మెల్యేలను నేరుగా కలిసి.. తనకు మద్దతునివ్వాల్సిందిగా వారిని కోరాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. గోల్డెన్‌ బే రిసార్ట్‌లో సుమారు 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఇందులో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు శశికళపై అసంతృప్తితో ఉన్నారని, వారు ఓపీఎస్‌కు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నేరుగా ఎమ్మెల్యేలను కలిసి.. తనకు అండగా ఉన్నవారిని.. తన వెంట తెచ్చుకోవాలని ఓపీఎస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఓపీఎస్‌కు మద్దతు పెరుగుతూనే ఉంది. ఆదివారం మరో ఐదుగురు ఎంపీలు సెల్వం గూటికి చేశారు. దీంతో ఓపీఎస్‌కు అండగా నిలిచిన ఎంపీల సంఖ్య 8కి చేరింది. మరింతమంది ఎంపీలు కూడా ఆయనకు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకే ఎంపీ ఆర్‌ లక్ష్మణన్‌ సెల్వానికి  జైకొట్టబోతున్నారని వార్తలు రావడంతో ఆయనపై చిన్నమ్మ వేటు వేసింది. అన్నాడీఎంకే పదవుల నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. లక్ష్మణన్‌ అధికారికంగా పన్నీర్‌ గూటికి చేరకముందే ఆయనపై వేటు పడటం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement